త్వరలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా... గ్రాడ్యుయేట్ ఓట్ల నమోదులో అలసత్వం వహిస్తున్నారంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై సీఎం చంద్రబాబు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం... గెలిస్తే మంత్రిని కూడా చేశాం... పార్టీ కోసం ఉపయోగపడకపోతే మీకు రాజకీయాలెందుకు? మీరు సరిగా పనిచేయకపోతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది... పట్టభద్రుల ఓట్ల నమోదును సీరియస్ గా తీసుకోకపోతే ఎలా? అంటూ చంద్రబాబు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేతలతో టెలీకాన్ఫరెన్స్ లో మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఆగ్రహం వెలిబుచ్చడంలో తప్పేమీ లేదన్నారు. విధి నిర్వహణలో తాను ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. ఇందులో అపార్ధాలకు చోటు లేదని అన్నారు. చంద్రబాబు తండ్రితో సమానం అని, ఆయన మందలింపును సానుకూలంగా స్వీకరించి ఇకపై బాధ్యతగా వ్యవహరిస్తానని తెలిపారు. గతంలో తాను వార్డు మెంబర్ ని కూడా కాదని, కానీ ఎమ్మెల్యేని చేసి, ఆపై మంత్రి పదవి ఇచ్చి గౌరవించారని, ఆ గుర్తింపును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని మంత్రి సుభాష్ పేర్కొన్నారు.