ఏపీ హోంశాఖపైనా, పోలీసులపైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల ప్రభావం తగ్గడం లేదు. వివిధ పార్టీల నేతలు దీనిపై స్పందిస్తున్నారు. ఏపీలో శాంతిభద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందంటున్న వైసీపీ.. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారని విమర్శిస్తోంది. హోం మంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తోంది. అయితే తాజాగా హోంమంత్రి వంగలపూడి అనితకు మద్దతుగా ఎమ్మార్పీఎస్ నిలిచింది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పందించారు. హోంమంత్రి వంగలపూడి అనితపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అవమానపరిచేలా ఉన్నాయని అన్నారు. ఏదైనా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని.. ఇలా బహిరంగంగా ఎలా మాట్లాడుతారని అన్నారు.
"పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఆ రకమైన మాటలు రావటం దురదృష్టకరం. మంత్రిగా ఏదైనా ఒక విషయం మీద మాట్లాడుతున్నప్పుడు, మంచీచెడులు ఏవైనా ఉంటే అవి కేబినెట్ భేటీలో మాట్లాడుకోవాలి. లేదా అంతర్గతంగా మాట్లాడుకోవాలి. అన్నీ సక్రమంగా ఉండకపోవచ్చు. సక్రమంగా లేని వాటి మీద బహిరంగంగా అలా మాట్లాడటం సరికాదు. ఏ శాఖలోనైనా లోపం జరుగుతోందని మీరు భావిస్తే ముఖ్యమంత్రి, మంత్రివర్గంలో చెప్పాలి. అంతేకానీ.. ఫలానా శాఖలో పనితీరు బాగా లేదని మీరు బహిరంగంగా మాట్లాడితే ఆ శాఖకు నేతృత్వం వహిస్తున్న దళిత మహిళా హోంమంత్రి అవమానించినట్టే కదా"
"ఏమైనా సమస్యలు ఉంటే కుటుంబంలో మాట్లాడుకున్నట్లు మాట్లాడుకోవాలి. అంతే కానీ.. చిన్నపిల్లాడిలా మాట్లాడితే ఎలా. శాంతిభద్రతలను, జరుగుతున్న పరిణామాలను అరికట్టడంలో విఫలమయ్యారంటే అది హోంమంత్రికే కాదు మొత్తం ప్రభుత్వానికే వస్తుంది. ప్రభుత్వానికి వస్తుందంటే ముఖ్యమంత్రికి కూడా వర్తిస్తుంది. పవన్ కళ్యాణ్ అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎన్నికల సమయంలోనే పవన్ కళ్యాణ్ గురించి మేము అసంతృప్తి వ్యక్తం చేశాం. సామాజిక న్యాయం అని చెప్పే ఆయన.. జనసేన తరుఫున ఒక్క దళిత వ్యక్తికైనా సీటిచ్చారా" అంటూ మందకృష్ణ మాదిగ విమర్శించారు.
మరోవైపు ఎన్నికల సమయంలోనే పవన్ కళ్యాణ్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు మందకృష్ణ మాదిగ చెప్పారు. చర్చలు జరిపినప్పుడే పవన్ కళ్యాణ్ మీద అసంతృప్తి వ్యక్తం చేశామని మందకృష్ణ మాదిగ చెప్పారు. గత ఎన్నికల సమయంలో మందకృష్ణ మాదిగ నేతృత్వంలోని ఎమ్మార్పీఎస్ టీడీపీ కూటమికి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడును మందకృష్ణ మాదిగ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కోరారు. ఎన్నికలకు ముందు 32 అంశాలపై ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలించాలని చంద్రబాబును కోరారు. ఎస్సీ వర్గీకరణ సహా వివిధ అంశాలపై సీఎం చంద్రబాబుతో గంటపాటు చర్చించారు.