ప్రైవేటు ఆస్తుల స్వాధీనం విషయంలో సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం చరిత్రాత్మక తీర్పు చెప్పింది.. ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని ఆస్తులను ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలులేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ విస్తృత ధర్మాసనం 8:1 మెజారిటీతో తీర్పు వెలువరించింది. ధర్మాసనంలోని చీఫ్ జస్టిస్, మరో ఆరుగురు న్యాయమూర్తులు ఒకటి, మిగతా ఇద్దరు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సుధాన్షు ధులియాలు వేర్వేరుగా మొత్తం మూడు తీర్పులను రాశారు. సీజే జస్టిష్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ రాజేశ్ బిండాల్, జస్టిస్ ఎస్సీ శర్మ, జస్టిస్ ఏజీ మనిశ్‌లు ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.
ఈ కేసు ప్రభుత్వ విధానం, నిర్దేశక సూత్రాలను నెరవేర్చడానికి చట్టాలను పరిరక్షించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 31కి సంబంధించింది. చట్టాలు, విధానాల రూపకల్పనలో రాజ్యాంగం నిర్దేశించిన మార్గదర్శకాలను ప్రభుత్వాలు తప్పక అనుసరించాలని చెబుతుంది. ఆర్టికల్ 39B ప్రకారం.. ప్రైవేట్ యాజమాన్యంలోని ఆస్తులు ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవచ్చు. కానీ, ఒక వ్యక్తికి చెందిన ప్రతి వనరు కూడా సమాజం ఉమ్మడి ప్రయోజనంగా పరిగణించబడదని ఎందుకంటే అది భౌతిక అవసరాలకు తగినది అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.
39B కిందకు వచ్చే ప్రశ్నలోని వనరు గురించిన విచారణ తప్పనిసరిగా పోటీ-నిర్దిష్టంగా ఉండాలి.. వనరు స్వభావం, లక్షణాలు, సమాజం శ్రేయస్సుపై దాని ప్రభావం, కొరత వంటి అంశాల సమగ్ర జాబితాకు లోబడి ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. 1977లో ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 4:3 మెజారిటీతో ప్రైవేట్ యాజమాన్యంలోని ఆస్తి అంతా సమాజం ఉమ్మడి వనరుల పరిధిలోకి రాదని తీర్పునిచ్చింది. అయితే, ఆర్టికల్ 39(బి) ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ వనరులు రెండూ సమాజం భౌతిక వనరులు పరిధిలోకి వస్తాయని అదే ధర్మాసనంలోని జస్టిస్ కృష్ణయ్యర్ అభిప్రాయపడ్డారు.
తాజాగా, తన ప్రత్యేక తీర్పులో జస్టిస్ అయ్యర్ తీర్పు విషయంలో ప్రధాన న్యాయమూర్తి చేసిన పరిశీలనలపై జస్టిస్ నాగరత్న విభేదించారు. ‘జస్టిస్ కృష్ణయ్యర్ రాజ్యాంగ, ఆర్థిక నిర్మాణం నేపథ్యంలో ప్రభుత్వానికి విస్తృత ప్రాధాన్యతనిచ్చిన నేపథ్యంలో సమాజంలోని భౌతిక వనరులపై తీర్పు ఇచ్చారు.. వాస్తవానికి, 42వ సవరణ రాజ్యాంగంలో సామ్యవాదాన్ని చేర్చింది. మేము మాజీ న్యాయమూర్తుల అభిప్రాయాన్ని తప్పుబడుతున్నాం..’ అని వివరించారు.