కెనడాలోని హిందూ ఆలయంపై ఖలీస్థానీ సానుభూతిపరుల దాడిని.. పిరికిపంద చర్యగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అభివర్ణించారు. బ్రాంప్టన్‌లో హిందూ ఆలయంలోకి చొరబడిన ఖలీస్థానీలు.. భక్తులపై దాడి చేసిన విషయం తెలిసిందే. దీనిపై మొదటిసారి స్పందించిన మోదీ. . ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ విధ్వంసక ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇవి భారత దౌత్యవేత్తలను బెదిరింపులకు గురిచేసే చర్యలని ఆయన మండిపడ్డారు. ఇటువంటి యత్నాలు మరింత భయంకరమైనవిగా వ్యాఖ్యానించిన ప్రధాని... ఈ హింసాత్మక చర్యలు భారత్ స్థైర్యాన్ని ఏమాత్రం దెబ్బతీయలేవని ఉద్ఘాటించారు. దీనిపై కెనడా ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు.
బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడటంతో అక్కడి భారతీయుల భద్రతపై కేంద్ర విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ‘తీవ్రవాదులు, వేర్పాటువాదుల హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఈ తరహా దాడుల నుంచి అన్ని ప్రార్థనా స్థలాలను సంరక్షించాలని మేం కెనడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.. హింసకు కారకులైన వారిని గుర్తించి శిక్షిస్తారని మేం ఆశిస్తున్నాం.. కెనడాలో భారతీయుల భద్రతపై న్యూఢిల్లీ ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతోంది.. భారతీయులకు కాన్సులర్ సేవలు అందించే దౌత్యవేత్తలు ఈ తరహా బెదిరింపులకు ఏ మాత్రం భయపడరు’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
బ్రాంప్టన్‌లోని ఆలయ కాంప్లెక్స్‌లో కొందరు ఖలిస్థానీలు భక్తులపై దాడికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆలయం వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఈ ఘటనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం తీవ్రంగా పరిగణించారు. తమ దేశంలో ప్రజలకు అన్ని మతాలను పాటించే హక్కును కాపాడతామని ఆయన పేర్కొన్నారు. భారత కాన్సులేట్‌కు సమీపంలోనే ఈ ఘటన జరగడంతో భద్రతను కట్టుదిట్టం చేయాలని, తమ పౌరుల భద్రతపై ఆందోళన చెందుతున్నామని హైకమిషన్ కోరింది. ఆలయంపై దాడి వెనుక భారత వ్యతిరేక శక్తులు హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేసింది.
గతేడాది జూన్‌లో జరిగిన ఖలీస్థానీ హరదీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయమై భారత్‌పై కెనడా ప్రధాని చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దారుణంగా క్షీణించాయి. ఈ తరుణంలో హిందూ ఆలయంలోకి ఖలీస్థానీ వేర్పాటువాదులు దాడికి దిగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కాగా, గతేడాది కూడా కెనడాలోని హిందూ ఆలయాలపై దాడులు చోటుచేసుకున్నాయి. ఒంటారియో, విండ్సర్‌లో ఆలయాలపై దుండుగులు దాడి చేశారు.