తిరుమల తిరుపతి దేవస్థానం 54వ పాలక మండలి చైర్మన్ గా బిఆర్ నాయుడు ఉదయం 7:30 గంటలకు పదవి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా క్షేత్ర సంప్రదాయం అనుసారం శ్రీ భూ వరహా స్వామి వారిని బీఆర్ నాయుడు కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 ద్వారా ఆలయ ప్రవేశం చేశారు. అనంతరం శ్రీ వారి సన్నిధిలో టీటీడీ పాలకమండలి చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావు గరుడాల్వర్ సన్నిధి వద్ద బిఆర్ నాయుడుతో ప్రమాణం చేయించారు. ప్రమాణం అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించారు. టీటీడీ ఈవో శ్యామలరావు చైర్మన్ బీఆర్ నాయుడుని పట్టువస్త్రంతో సత్కరించగా…. అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక చైర్మన్ బిఆర్ నాయుడుతో కలసి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే రాజు, జ్యోతుల నెహ్రూ, నర్సీ రెడ్డిలు పాలకమండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు.