ద్విచక్ర వాహనాల చోరీ ముఠా గుట్టును ఏలూరు, కైకలూరు పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి.. వారి నుంచి రూ.17.50 లక్షలు విలువైన 25 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ వివరాలు వెల్లడించారు. ఏలూరు సుబ్బులవారి వీధికి చెందిన పూతి ప్రసాద్, గుడిసె నాగాంజనేయులు, పాలకొల్లు చెరువుగట్టు ప్రాంతానికి చెందిన నడిపూడి అప్పలనాయుడు ముఠాగా ఏర్పడి ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్నారు.ఏలూరు రెండో పట్టణంలో 16, కలిదిండిలో 4, తాడేపల్లిగూడెం, ముదినేపల్లి, కైకలూరు, భీమవరం గ్రామీణం, ఏలూరు ఒకటో పట్టణం పోలీసుస్టేషన్ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున ద్విచక్ర వాహనాలు అపహరించారు. వీరిలో పూతి ప్రసాద్ పాత నేరస్థుడు. ఏలూరు, హనుమాన్ జంక్షన్, తాడేపల్లిగూడెం, తణుకు పోలీసుస్టేషన్ల పరిధిలో గతంలో అరెస్టయి జైలు జీవితం అనుభవించాడు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతుండటంతో.. పోలీసులు నిఘా ఉంచి నిందితులను అరెస్టు చేశారు.