ప్రముఖ ఐటీ సేవల సంస్థ యూఎస్‌టీ దేశీయ టెకీలకు సోమవారం అదిరే శుభవార్త అందించింది. బెంగళూరులో తమ ఆపరేషన్స్ విస్తరిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా సిలికాన్ సిటీలో రెండో ఆఫీసును ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కొత్త ఆఫీసు 17 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో 300 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించే సామర్థ్యం ఉందని తెలిపింది. తమ కొచ్చి కేంద్రంలో తమ ఉద్యోగుల సంఖ్యను వచ్చే 5 ఏళ్లలో 6 వేలకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించిన నెల రోజుల్లోనే ఈ కొత్త ఆఫీసును ప్రారంభించడం గమనార్హం. ప్రస్తుతం కొచ్చి ఆఫీసులో 2800 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
ప్రస్తుతం భారత్‌లోని యూఎస్టీ టెక్ కంపెనీకి చెందిన బ్రాంచీల్లో కేరళలోని తిరువనంతపురం సెంటర్ 7,500 మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే అతిపెద్ద యూఎస్‌టీ కేంద్రంగా ఉంది. అలాగే బెంగళూరు కేంద్రంగా ఈ కంపెనీ 2012లో సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కేంద్రంలో 6 వేలకుపైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్రాంచీల్లో తిరువనంతపురం తరువాత రెండో అతిపెద్ద కేంద్రంగా ఉంది. 2012 నుంచి చూసుకుంటే బెంగళూరు కేంద్రం స్థిరమైన అభివృద్ధిని సాధిస్తోందని కంపెనీ తెలిపింది. సెమీకండక్టర్, హెల్త్ కేర్, టెక్నాలజీ, లాజిస్టిక్స్, హై-టెక్, రిటైల్, బీఎఫ్ఎస్ఐ వంటి రంగాల్లో అధునాత సాంకేతిక సేవలను అందిస్తోంది. భారత దేశవ్యాప్తంగా ఈ కంపెనీకి మొత్తం 20 వేల మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. అదే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 30 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అంటే భారత్‌లోనే ఎక్కువ మంది పని చేస్తున్నారు.
'బెంగళూరులో మా రెండవ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సంతోషిస్తున్నాం. ఇది మా నిరంతర వృద్ధికి నిదర్శనంగా ఉంటుంది. అలాగే యూఎస్‌టీ భవిష్యత్తు వైపు ముందుకు తీసుకెళ్లే మార్గాన్ని సూచిస్తుంది. అత్యుత్తమ ఐటీ, టెక్నాలజీ ప్రతిభతో నడిచే బెంగళూరు ఎల్లప్పుడూ యూఎస్‌టీ టెక్నాలజీ, డిజిటల్ సామర్థ్యాలకు కీలకమైన ప్రదేశంగా ఉంటుంది. ఈ విస్తరణ మా సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, మా కస్టమర్ల కోసం అధిక విలువైన పరిష్కారాలను అందించేందుకు ప్రాధాన్యతనిస్తూనే ఉన్నందున ఆవిష్కరణలో ముందంజలో ఉంచుతుందని మేము విశ్వసిస్తున్నాం.' అని యూఎస్‌టీ వైస్ ప్రెసిడెంట్, బెంగళూరు సెంటర్ హెడ్ కిరణ్ కుమార్ దొరస్వామి పేర్కొన్నారు.