జమ్మూకశ్మీర్‌లోని అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏను పునరుద్ధరించాలంటూ కొందరు ఎమ్మెల్యేలు బ్యానర్లు, పోస్టర్లను ప్రదర్శించారు. దీంతో అక్కడ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఆదేశించడంతో రంగంలోకి దిగిన మార్షల్స్ ఓ ఎమ్మెల్యేను బయటకు పంపించివేశారు. గురువారం కూడా అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే.మరోవైపు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సునీల్ శర్మ(భాజపా) మాట్లాడుతుండగా.. బారాముల్లా ఎంపీ ఇంజినీర్ రషీద్ సోదరుడు, అవామీ ఇత్తేహాద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ వెల్ వద్దకు దూసుకొచ్చి, ఆర్టికల్ పునరుద్ధరించాలని బ్యానర్ ప్రదర్శించారు. దాంతో భాజపా నేతలు జోక్యం చేసుకున్నారు. ఆ బ్యానర్‌ను లాగి, చించివేయడంతో అది కాస్తా తీవ్ర గందరగోళానికి కారణమైంది. ఖుర్షీద్‌తో పాటు భాజపా ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు పంపివేశారు. తమ నేతలను మార్షల్స్‌తో బయటకు పంపించడాన్ని వ్యతిరేకిస్తూ భాజపా వాకౌట్ చేసింది. ఈ పరిణామాల మధ్య సభ 15 నిమిషాలు వాయిదా పడింది. ఆ తర్వాత కూడా సభలో నిరసనలు కొనసాగాయి.
అధికరణాలు 370, 35ఏలను పునరుద్ధరించాలంటూ ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన తీర్మానాన్ని భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దానిని ఉపసంహరించుకోవాలని చేస్తోన్న డిమాండ్‌ను స్పీకర్ తోసిపుచ్చారు.