ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖపట్నంవాసులకు సూపర్ న్యూస్.. నగరంలో ఫేమస్ హోటల్, 100 ఎకరాల్లో!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 08, 2024, 08:16 PM

విశాఖపట్నంలో మరో భారీ హోటల్‌ రాబోతోంది. నగరంలో తాజ్‌ గ్రూప్‌ భారీ హోటల్‌ను నిర్మించేందుకు ఆసక్తిగా ఉంది. ఈ మేరకు తాజ్ గ్రూప్ ప్రతినిధులు రెండు రోజులుగా విశాఖపట్నంలో స్థల పరిశీలన చేశారు.. తాజ్ ప్రతినిధులు బుధవారం విశాఖపట్నంలోని కొన్ని స్థలాలను పరిశీలించగా.. గురువారం అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. అచ్యుతాపురం పరిసర ప్రాంతాల్లో స్థలాన్ని పరిశీలించారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో తీరానికి సమీపంలో తమకు వంద ఎకరాలు కేటాయిస్తే భారీ హోటల్‌ నిర్మించేందుకు తాజ్ గ్రూప్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.


అంతేకాదు తాజ్ గ్రూప్ ప్రతినిధులు విజయనగరం జిల్లాలోని భోగాపురం సమీప ప్రాంతాలనూ భూముల్ని పరిశీలించారు. పర్యాటక, రెవెన్యూశాఖ అధికారులు ఆయా భూములను తాజ్‌ ప్రతినిధులకు భూముల్ని చూపించారు. తాజ్ గ్రూప్ భోగాపురాన్ని కూడా ఒక ఆప్షన్‌గా భావిస్తోంది.. అక్కడ ఎయిర్‌పోర్టు నిర్మాణం జరుగుతుండటంతో.. అక్కడ హోటల్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తోంది. త్వరలోనే తాజ్ గ్రూప్ హోటల్ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.


మరోవైపు విశాఖపట్నంలో సీఐఐ 4వ జోనల్‌ స్థాయి సమావేశం జరిగింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రస్తావించిన అంశాలపై జిల్లా అభివృద్ధిపై చర్చ జరిగింది. అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని.. అదే సందర్భంలో పారిశ్రామిక వేత్తలకు పూర్తి సహకారం అందిస్తామన్నారు జిల్లా కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌. జిల్లాలో అభివృద్ధి ప్రాజెక్టుల్ని భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వచ్చేలోపు పూర్తి చేస్తామన్నారు. వీఎంఆర్‌డీఎ, జీవీఎంసీ సహాయంతో రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేస్తున్నామని..అన్నివర్గాల నుంచి తమకు సహకారం కావాలన్నారు.


నగరంలో అభివృద్ధితో పాటు డబుల్ డక్కర్ ఫ్లై ఓవర్లు, పచ్చదనం పెంపు, రెవెన్యూకు సంబంధించిన పలు అంశాలపై ఫోకస్ పెడతామన్నారు. రాబోయే రోజుల్లో మెట్రో కారిడార్‌కు సంబంధించి 12 పైవంతెనలు వస్తాయన్నారు కలెక్టర్. కైలాసగిరి కొండపై పర్యాటకుల్ని ఆకర్షించేలా పచ్చదనం పెంపు, సౌకర్యాల కల్పనపై దృష్టి సారిస్తామని చెప్పారు. అంతేకాదు పంచగ్రామాల భూ సమస్య పరిష్కారంపై ఫోకస్ పడెతామని.. గాజువాక, ములగాడ మండలాల పరిధిలో కొన్ని భూముల్ని పరిశీలించాం. వాటిపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు.


నగరంలో ట్రాఫిక్‌ సమస్య లేకుండా ఎక్స్‌ప్రెస్‌ కారిడార్లు ఏర్పాటు చేస్తామని.. దువ్వాడ, అచ్యుతాపురం, గంగవరం పోర్టు, ఇతర పారిశ్రామికవాడలకు రోడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలకు సమీపంలో ఉండే ప్రజలతో పారిశ్రామిక వేత్తలు సత్సంబంధాలు కొనసాగించాలన్నారు నగర పోలీసు కమిషనర్‌ శంఖబ్రతబాగ్చీ. భద్రతా ప్రమాణాలు పాటించాలని.. జిల్లాలో ట్రాఫిక్‌ సమస్య నివారణకు ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే 79950 95799 నెంబరులో తెలియజేయాలని సూచించారు.


గ్రీన్‌ ఎనర్జీని ప్రోత్సహించేలా చర్యలను తీసుకుంటున్నామన్నారు ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్‌. విశాఖపట్నలంో భూగర్భ విద్యుత్ కేబుల్‌ వ్యవస్థ విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లోనూ త్రీఫేజ్‌ విద్యుత్తు సరఫరా అందించేందుకు కృషి చేస్తామన్నారు. విశాఖపట్నంలో టెంపుల్‌ టూరిజం, ట్రావెల్‌ టూరిజానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఐఐ ఏపీ సెక్టార్‌ ఛైర్మన్‌ మురళీకృష్ణ, విశాఖ జోన్‌ ఛైర్మన్‌ రాజేష్ కోరారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహకాలు, రాయితీలు అందించాలని రిక్వెస్ట్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com