తల్లి, చెల్లిపై వల్గర్ గా పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రారెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అత్యంత అమాయకుడు, అతని కోసం ఎంతమంది లాయర్లనైనా పెడతానని జగన్ అనడం చాలా హాస్యాస్పదంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. జగన్ తల్లి, చెల్లిపై వల్గర్ గా పోస్టులు పెట్టిన వర్రా రవీంద్ర రెడ్డిని జగన్ వెనకేసుకురావడమా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడారు. వర్రా రవీంద్రా రెడ్డి జగన్ తల్లి, చెల్లిపై పెట్టిన పోస్టులను ఒక్కొక్కటిగా చదువుతూ జగన్ పై పలు ప్రశ్నలు సంధించారు. "జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై నీతిబాహ్యమైన వ్యాఖ్యలు చేసిన వర్రా రవీంద్రారెడ్డిని జగన్ వెనకేసుకరావడం సిగ్గుచేటు. వర్రా రవీంద్రరెడ్డి మంచివాడు అని జగన్ అంటే నేను జగన్ ఇంటిముందు నిలబడి సెల్యూట్ చేయడానికి సిద్దంగా ఉన్నాను. జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై వర్రా రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులు అత్యంత అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయి. ఆ పోస్టులు షర్మిల గనుక చూస్తే కత్తితో నిన్ను పొడవనా? నేను పొడచుకోనా? అని జగన్ పైకి వస్తుందనడంలో సందేహం లేదు. ఇంతటి జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కాపాడడానికి జగన్ కు మనసెలా ఒప్పింది?పాత్రికేయ సమావేశంలో జగన్ వర్రా రవీంద్రను మంచివాడని అనడంతో సిగ్గుకే సిగ్గనిపించేలా ఉంది. ఎవరికో పుట్టిన షర్మిలను జగన్ తన సొంత చెల్లిలా చూసుకున్నాడు అని వర్రా రవీంద్రారెడ్డి పోస్టు పెడితే జగన్ ఈ విధంగా స్పందించడం చెల్లి పట్ల ఆయనకున్న అభిప్రాయం ఎలాంటిదో తెలుస్తోంది. జగన్ గతంలో దుర్మార్గం, దురాలోచనలతో ఎదుటివారిని మానసికంగా హింసించి శునకానందం పొందేవారు. ఆ దురాలోచనే జగన్ తల్లిని, చెల్లిని తాకాయి. అసభ్యకర పోస్టులు పెట్టినవారిని కాపాడడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేసి జగన్ వార్ రూమ్ పెట్టడం దుర్మార్గం. తల్లిని, చెల్లిని దూషిస్తే ఊరుకునేవారిలో జగన్ ప్రథముడని తెలుస్తోంది. జగన్ తల్లి, చెల్లి గురించి బూతు పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రారెడ్డిని అరెస్టు చేయాలో? వద్దో జగనే చెప్పాలి. ఈ విషయం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. జగన్ కు ఓడిపోతేగానీ చట్టాలు, ప్రజాస్వామ్యం గురించి గుర్తుకు రావా? జగన్ మానసిక స్థితి గురించి ఏమనుకోవాలో... వైసీపీ నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నాం" అంటూ వర్ల రామయ్య పేర్కొన్నారు.