ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీకి చెందిన ఫోర్త్ జనరేషన్ డిజైర్ అరుదైన ఘనత సాధించింది. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో ఈ కాంపాక్ట్ సెడాన్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. పెద్దల భద్రత విషయంలో 5 స్టార్ రేటింగ్, చిన్నారుల భద్రతకు సంబందించి 4 స్టార్ పొందింది. గ్లోబల్ ఎన్‌క్యాప్ నుంచి 5 స్టార్ రేటింగ్ పొందిన తొలి మారుతీ సుజుకీ కారు ఇదే కావడం విశేషం.సేఫ్టీ రేటింగ్ విషయంలో మారుతీ సుజుకీపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ.. డిజైర్ ఫైవ్ స్టార్ రేటింగ్ అందుకోవడం గమనార్హం. స్వచ్ఛందంగా మారుతీ ఈ వెహికల్‌ను క్రాష్ టెస్ట్‌కు పంపింది. పెద్దల భద్రతకు సంబంధించి 34 పాయింట్లకు గాను 31.24 పాయింట్లను కొత్త డిజైర్ సాధించింది. చిన్నారుల భద్రతకు సంబంధించి 42 పాయింట్లకు గాను 39 పాయింట్లు పొందింది. ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగులు, అన్ని సీట్లకు 3 పాయింట్ సీట్ బెల్ట్ విత్ రిమైండర్ ఉన్నాయి. ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ పరంగా అనేక మార్పులతో కొత్త తరం డిజైర్‌ను మారుతీ సుజుకీ ఇటీవలే ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ కార్లకు సంబంధించి బుకింగ్‌లు కొనసాగుతున్నాయి. నవంబర్ 11న ధర, ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో క్రాష్ టెస్ట్ వివరాలు బయటకు వచ్చాయి. గతంలో జపాన్ ఎన్‌క్యాప్ నుంచి మారుతీ సుజుకీ స్విఫ్ట్ 4 స్టార్ రేటింగ్ అందుకుంది.