పౌరసేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు మెటాతో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెలాఖరు నాటికి 100 రకాల సేవలను వాట్సాప్ ద్వారా అందించేలా చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియల్ టైమ్ గవర్నెన్స్ మీద నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్టీజీఎస్‌లో జరుగుతున్న డాటా ఇంటిగ్రేషన్ పనులను గురించి సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు.
పౌరసేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో మెటా ప్రతినిధులతో.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెలాఖరుకల్లా వంద రకాల పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని ఐటీ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు రియల్ టైమ్ గవర్నెన్స్ మీద సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న నారా లోకేష్.. వాట్సాప్ ద్వారా పౌరసేవల విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.
వాట్సాప్ ద్వారా నవంబర్ నెలాఖరుకు వంద సేవలు పౌరులకు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వివరించారు. వచ్చే మూడు నెలల్లో క్యూఆర్ కోడ్ ద్వారా విద్యార్థులు తమ సర్టిఫికేట్లు పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మార్చి నెలాఖరు నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు వాట్సాప్ ద్వారా పౌరసేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఈ విధానంపైనా ప్రజలకు, అధికారులకు అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు.. నారా లోకేష్‌కు సూచించారు.
మరోవైపు ఆర్టీజీఎస్‌లో జరుగుతున్న డేటా ఇంటిగ్రేషన్ పనుల పురోగతిని చంద్రబాబు అధికారులను ఆడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంలో మొత్తం 40 శాఖలున్నాయన్న అధికారులు.. 128 విభాగాధిపతుల వద్ద నుంచి 500 టీబీల డాటా లభ్యమవుతుందని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో రియల్ టైమ్ డేటా అందించే ఏకైక వనరుగా ఆర్టీజీ పనిచేయాలన్న చంద్రబాబు.. అన్ని విభాగాల్లోని సమాచారాన్ని అనుసంధానం చేసి, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. అన్ని గృహాలను జీపీఎస్ ద్వారా అనుసంధానం చేయాలని.. పుట్టిన ప్రతి బిడ్డకు ఆధార్ తప్పనిసరిగా మంజూరు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికీ ఆధార్ కార్డు లేకుండా ఉండొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు.