మరికొన్ని రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ తేదీ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు.. ఆ రాష్ట్రంలో హామీలు, మేనిఫేస్టోలు విడుదల చేస్తూ పార్టీలు రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార కూటమి ఇచ్చిన హామీలకు ధీటుగా ప్రతిపక్ష కూటమి కూడా.. మహారాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఎమ్మెల్యే అభ్యర్థి ఇచ్చిన హామీ మాత్రం విచిత్రంగా ఉంది. తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే.. నియోజకవర్గంలో ఉన్న పెళ్లి కాని వారికి వివాహాలు జరిపిస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఈ హామీ మహారాష్ట్రలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీడ్ జిల్లాలోని పర్లీ నియోజకవర్గం నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్ పవార్ (ఎన్సీపీ ఎస్పీ) వర్గం నుంచి రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పర్లి నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజేసాహెబ్ దేశ్‌ముఖ్.. ఓ విచిత్రమైన హామీ ఇచ్చారు. తనను ఎన్నికల్లో గెలిపిస్తే బ్యాచిలర్స్‌కు పెళ్లిళ్లు చేసి, ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు.
ఎవరైనా యువతి గానీ, యువకుడు గానీ పెళ్లి చేసుకోవాలంటే.. వారికి ఉద్యోగం ఉందా, వ్యాపారం చేస్తున్నావా అని అడుగుతారని రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ అన్నారు. బీడ్ జిల్లా మంత్రిగా ఉన్న ధనంజయ్ ముండేకే వ్యాపారం లేనప్పుడు.. ఆయన జిల్లాలోని నిరుద్యోగులకు ఏం ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు అని ప్రశ్నించారు. అలాంటప్పుడు మీరు ఎలా ఉద్యోగాలు పొందుతారని నిలదీశారు. పర్లి నియోజకవర్గానికి ధనుంజయ్ ముండే ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని విమర్శలు గుప్పించారు. దాని వల్ల పర్లి నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులు.. ఉద్యోగాలు లేక పెళ్లిళ్లు చేసుకోలేక బ్యాచిలర్లుగానే మిగిలిపోతున్నారు. దీంతో వారికి పెళ్లిళ్లు కావడం కూడా కష్టంగానే మారిందని రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే.. నిరుద్యోగాలకు ఉద్యోగాలు కల్పించి బ్యాచిలర్స్‌కు పెళ్లిళ్లు చేస్తా అని స్పష్టం చేశారు.
ఇక ఈ ఎన్నికల సందర్భంగా రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఎన్సీపీ (అజిత్ వర్గం) నేత ధనుంజయ్ ముండే.. జిల్లాకు, నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకురావడంలో విఫలం కావడం వల్లే యువత ఉద్యోగాల్లేక పెళ్లిళ్లు జరగక ఇబ్బంది పడుతున్నారని రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇక 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.