దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోట.. మహిళలపై పురుషులు లైంగిక దాడులకు పాల్పడటం, అత్యాచారాలు చేసి హత్యలు చేయడం వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి దారుణాలను అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు, మహిళా కమిషన్లు, ఎన్జీఓ సంఘాలు అనేక కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తర్‌ప్రదేశ్ మహిళా కమిషన్.. మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ఆపడానికి సరికొత్త ప్రతిపాదనలను తెరపైకి తీసుకువచ్చాయి. వాటన్నింటినీ రూపొందించిన మహిళా కమిషన్.. త్వరలోనే వాటిని ప్రభుత్వం ముందు ప్రవేశపెట్టనున్నట్లు సభ్యులు తెలిపారు.
కొందరు పురుషుల్లో మహిళలపై ఉన్న దురుద్దేశాలను తొలగించడంతో పాటు బ్యాడ్ టచ్ నుంచి మహిళలకు రక్షణ కల్పించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు తీసుకువచ్చింది. ఇందులో అతి ముఖ్యమైంది మహిళల బట్టలను పురుషులు కుట్టకూడదని తెలిపింది. అంతేకాకుండా మహిళల దుస్తుల కొలతలను కూడా పురుషులు తీసుకోకూడదని పేర్కొంది. ఇవి మాత్రమే కాకుండా మహిళల జుట్టును కత్తిరించే పనులు కూడా పురుషులు చేయకూడదని తెలిపింది. ఇటీవల నిర్వహించిన కమిషన్ సమావేశంలో ఈ ప్రతిపాదనలు చేసినట్లు ఉత్తర్‌ప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు హిమానీ అగర్వాల్ వెల్లడించారు.
టైలర్లు, బార్బర్ సహా మరికొన్ని వృత్తుల్లో ఉన్న పురుషులు.. టైలరింగ్, కటింగ్ పేరుతో మహిళలను అసభ్యంగా తాకుతూ వేధింపులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయని ఆమె తెలిపారు. అలాంటి వారి నుంచి మహిళలను రక్షించడానికే ఈ ప్రతిపాదనలు తీసుకువచ్చినట్లు హిమానీ అగర్వాల్ వెల్లడించారు. ఇవేకాకుండా మరికొన్ని ప్రతిపాదనలను కూడా మహిళా కమిషన్ తీసుకున్నట్లు ఆమె వివరించారు. అమ్మాయిల దుస్తుల కొలతలు కేవలం మహిళలు మాత్రమే తీసుకోవాలని మహిళా కమిషన్ తెలిపింది. అలాంటి ప్రదేశాల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. సెలూన్‌లలో మహిళలకు మహిళలే చేయాలని ప్రతిపాదించింది.
జిమ్, యోగా సెంటర్లలో మహిళా ట్రైనర్లే అమ్మాయిలకు నేర్పించాలని యూపీ మహిళా కమిషన్ తెలిపింది. అలాంటి జిమ్‌లను తప్పనిసరిగా వెరిఫికేషన్ చేయాలని సూచించింది. స్కూల్ బస్సుల్లో తప్పనిసరిగా మహిళా ఆయా లేదా ఉపాధ్యాయురాలు ఉండాలని పేర్కొంది. డ్రామా ఆర్ట్ సెంటర్లలో అమ్మాయిలకు మహిళా డ్యాన్స్ టీచర్లను ఏర్పాటు చేయాలని వెల్లడించింది. మహిళలకు సంబంధించిన వస్తువులు అమ్మే షాప్‌లలో తప్పనిసరిగా మహిళా సిబ్బందే ఉండాలని తెలిపింది. కోచింగ్ సెంటర్లలో సీసీటీవీలను ఏర్పాటు చేయాలని.. అంతేకాకుండా మహిళలకు వాష్‌రూమ్‌లు ఉంచాలని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రతిపాదనలను త్వరలోనే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి పంపించి.. ఇలాంటి నిబంధనలను అమలు చేసేందుకు కఠిన చట్టం తీసుకోవాలని కోరనున్నట్లు మహిళా కమిషన్ తెలిపింది.