శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ప్రభుత్వ అధికారులు షాకిచ్చారు. ధర్మవరానికి ఆనుకుని ఉన్న చిక్కవడియార్ చెరువును ఆక్రమించారంటూ నీటి పారుదలశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు అక్కడ భూమికి సంబంధించి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతికి నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లోగా కబ్జా చేసిన స్థలాలను ఖాళీ చేయాలని.. ఒకవేళ ఖాళీ చేయకపోతే అక్కడ నిర్మాణాలు, చెట్లు, పంటలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని నోటీసుల్లో ప్రస్తావించారు. అలాగే కేతిరెడ్డి ప్రధాన అనుచరుడు జె.సూర్యనారాయణకు ధర్మవరం తహసీల్దారు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించారని.. వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. ధర్మవరంలో ప్రభుత్వ భూములు, చెరువు కలిపి మొత్తంగా 30 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గుర్తించారు అధికారులు.
ధర్మవరం శక్తివడియార్ చెరువు, దాని పరీవాహక ప్రాంత భూమికి సంబంధించి రికార్డులను బటయకు తీశారు అధికారులు. సర్వే నెంబర్ 908లో 9.30 ఎకరాలు, 909 సర్వే నెంబర్లో 7.90 ఎకరాలు, 910లో 2.50, సర్వే నెంబర్ 661-1లో 0.91 సెంట్లను ఆక్రమించినట్లు కేతిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతికి నోటీసులు జారీ చేశారు. నోటీసులో ఆక్రమిత భూమి వివరాలను ప్రస్తావిస్తూ 20.61 ఎకరాల భూమిని వారం రోజుల్లో ఖాళీ చేయాలని పేర్కొన్నారు. అయితే నోటీసుల్ని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇంటి చిరునామాకు పంపించారు అధికారులు.
గత ఐదేళ్లు ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పెద్ద ఎత్తున భూముల్ని ఆక్రమించినట్లు ఆరోపణలు వచ్చాయి. నారా లోకేష్ 2023 ఏప్రిల్‌లో పాదయాత్ర సందర్భంగా ధర్మవరం చెరువు కబ్జాపై బహిరంగ సభలో ఘాటు విమర్శలు చేశారు. దీనికి కేతిరెడ్డి కౌంటర్‌గా.. భూ ఆక్రమణల్ని నిరూపించాలని లోకేష్‌ను సవాలు చేశారు. ఆ మరుసటి రోజు చెరువు కబ్జా జరిగింది అంటూ కొన్ని డాక్యుమెంట్లను లోకేష్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంనటే కేతిరెడ్డి భూ కబ్జాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాజాగా నోటీసులు జారీ చేశారు.
కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్) భార్య వసుమతి పేరుతో రైతుల నుంచి 25 ఎకరాలు (ధర్మవరం రెవెన్యూ గ్రామం పరిధిలోని 904, 905, 908, 909 సర్వే నంబర్లలో) కొనుగోలు చేసినట్లు రికార్డులో ఉంది. అలాగే సర్వే నంబర్లు 908, 909, 910, 616-1లో ఉన్న చెరువు స్థలం 20 ఎకరాల వరకు ఆక్రమించి కలిపేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అక్కడ ఫాంహౌస్‌తో పాటుగా రేసింగ్ ట్రాక్, గుర్రాల కోసం షెడ్లు, చెరువులో బోటింగ్ వంటివి ఏర్పాటు చేశారు. అక్కడ కొన్ని పండ్ల తోటల్ని సాగు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు మల్లాకాలువ గ్రామ పరిధిలో1-1, 2-1, 2-2.. అలాగే పోతుల నాగేపల్లి గ్రామ పరిధిలో 43-2ఏ, 43-2బీ సర్వే నంబర్లలోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ భూముల్ని కేతిరెడ్డి మరదలు వసుమతి, తన ప్రధాన అనుచరుడు జె.సూర్యనారాయణ పేరుతో ఉన్నట్లు సమాచారం. రెవెన్యూ అధికారులు ఈ భూమికి సంబంధించి 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.
ఈ నోటీసుల అంశంపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పందించారు.. రాజకీయంగా తనను టార్గెట్ చేసినట్లు చెప్పుకొచ్చారు. 904, 905, 908, 909 సర్వే నంబర్లలో తన సోదరుడికి భూములు ఉన్న మాట నిజమేనన్నారు. ఇరిగేషన్‌కు సంబంధించిన భూములు కేవలం 661 సర్వే నంబర్‌లో మాత్రమే ఉన్నాయన్నారు.. మిగిలిన సర్వే నంబర్లు ఇరిగేషన్ భూములు కిందకు రావన్నారు. తన భూమి పక్కన ఉన్న సూర్యనారాయణ అనే రైతుకు నోటీసులు ఇచ్చారు. అది కూడా 43-2ఏ, 43-2బీ చుక్కల భూమి అని ఇచ్చారని.. నాగలక్ష్మి కలెక్టర్‌గా ఉన్నప్పుడు రెగ్యులరైజ్ చేశారన్నారు. తనకు ఇరిగేషన్ ఇచ్చిన నోటీసులు అసందర్భమని.. గతంలోనే తాను హైకోర్టులో ఛాలెంజ్ చేశానని, హైకోర్టు ఆ నోటీసును కొట్టివేసిందన్నారు. తన పరువు తీయడానికే కూటమి ప్రభుత్వం మళ్లీ నోటీసులు ఇచ్చిందని.. అందరిపైనా చర్యలు తీసుకుంటానన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని.. చట్ట ప్రకారం అందరిపై కేసు వేస్తానన్నారు.