ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలో రూ.505 కోట్లతో నిర్మించిన 400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ.702 కోట్లతో నిర్మించిన 5 సబ్ స్టేషన్లను కూడా వర్చువల్ గా ప్రారంభించారు. రూ.4,665 కోట్లతో చేపట్టనున్న 14 ఏపీ ట్రాన్స్ కో పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీకాకుళం, కృష్ణా, నంద్యాల జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు.
ఈ క్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడికి ముఖ్యమంత్రి చురకలంటించారు. ఇచ్ఛాపురం సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు కనపించకపోవడంతో చంద్రబాబు ప్రశ్నించారు. ‘కలెక్టర్ గారూ.. మీ మంత్రి, ఎంపీకి సమాచారం ఇవ్వలేదా?’ అని స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను ప్రశ్నించారు. తాను కేంద్రమంత్రికి సమాచారం ఇచ్చానని కలెక్టర్ చెప్పారు. ‘ఎంత బిజీగా ఉన్నా ప్రజలకు దూరం కాకూడదు కదా! వర్చువల్‌గా కూడా జాయిన్ కావచ్చు. మంత్రులైనా ఎంపీలేననే విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలతో మమేకం కావాలి. దీని నుంచి తప్పించుకోకూడదు’ అని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడికి ముఖ్యమంత్రి చురక అంటించారు.
మరోవైపు గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలో కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటూ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. అక్కడ కూడా ఆసక్తికర ఘటన జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమం సమయంలో.. అక్కడ శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం ఫోటో సెషన్ జరిగింది.. అప్పుడు చంద్రబాబు పెమ్మసానిని పిలిచారు. వచ్చి తన పక్క నిలబడాలని చెప్పారు. 'చంద్రశేఖరు ఇటు రా నువ్వు మంత్రివయ్యా , ఎంపీవి కూడా.. ప్రోటోకాల్ మల్ల సెంటర్ స్టేట్ ప్రాబ్లం రాకుండా' అంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత పక్కనే ఉన్న పెమ్మసానిని ఉద్దేశించి.. ఆరు నెలలైంది.. రాష్ట్రానికి ఇంకా డబ్బులు తీసుకురాలేదంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మొత్తం మీద కేంద్రమంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చురకలంటించారు.