ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇవాళ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించారు. రఘురామను చైర్ లో కూర్చోబెట్టిన అనంతరం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీలో ప్రసంగించారు. కర్మ ఎంత బలంగా ఉంటుందో చెప్పడానికి రఘురామ ఉదంతమే నిదర్శనం అన్నారు. నరసాపురం లోక్ సభ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగుపెట్టనివ్వబోమని సవాల్ చేసిన వారు ఇవాళ మీ ముందు అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయారు... కర్మ అంటే ఇదే... రఘురామ డిప్యూటీ స్పీకర్ పదవికి ఎన్నిక కాగా, రఘురామ ముందుకు వారు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి... ఇది దేవుడు రాసిన స్క్రిప్టు... ఇది ప్రజాస్వామ్యం గొప్పదనం అని పవన్ వివరించారు. "గత ప్రభుత్వంలో మనమందరం ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం... గత ప్రభుత్వ హయాంలో రాజకీయాలు కలుషితం అయ్యాయి... ఎన్ని కష్టాలు ఎదురైనా మీ పోరాట పటిమ అభినందనీయం... ఉండి అసెంబ్లీ స్థానం నుంచి 56 వేలకు పైగా మెజారిటీతో మీరు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఆ పదవికి వన్నె తెచ్చి, సభను గౌరవ సభగా ఉన్నత స్థానానికి చేర్చుతారని ఆశిస్తున్నాను. క్రిమినల్ మైండ్ సెట్ తో ఉన్న వాళ్లను రాజకీయాల్లోకి రానివ్వకూడదు. నేర మనస్తత్వం ఉన్నవాళ్లు వ్యవస్థలను గౌరవించరు, రాజ్యాంగ విధానాలను గౌరవించరు. గతంలో రఘురామకృష్ణరాజును ఎలా బాధించారో చూశాం. అంతకుముందు, సుప్రీంకోర్టు జడ్జిలను కూడా వదల్లేదు. ఓ మోస్తరు కార్యకర్తలను కూడా వదల్లేదు. ప్రతిపక్షంలో ఎవరినీ వదల్లేదు. స్వయంగా వారి పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికైన రఘురామను ఇబ్బందిపెట్టారు. విధానాల పరంగా విభేదించినందుకు శారీరకంగా, మానసికంగా వేధించారు. ఎంపీని అరెస్ట్ చేస్తారు, ఇబ్బంది పెడతారు అని అనుకున్నాం కానీ... నాడు రఘురామపై థర్డ్ డిగ్రీ పద్ధతులు ప్రయోగించడం, బెదిరించడం దారుణం. ఆ రోజున రఘురామ పరిస్థితిపై చంద్రబాబు వెంటనే స్పందించారు, ఏం జరుగుతుందోనని నాక్కూడా భయం వేసింది. ఆయన పరిస్థితి పట్ల చాలా ఆవేదన కలిగింది. క్రిమినల్స్ రాజ్యమేలితే ఎలా ఉంటుందో ఆ రోజున నాకు అర్థమైంది. ఓటు చీలనివ్వకూడదని నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనని... ఇవాళ మిమ్మల్ని డిప్యూటీ స్పీకర్ పదవిలో చూశాక అర్థమైంది. మిమ్మల్ని ఈ పదవిలో చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది" అంటూ రఘురామను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు.