సోంపేటకు చెందిన బాలయ్య.. ఈయన్ను అందరూ పాముల బాలయ్య అంటారు. జనావాసాల మధ్య పాము కనిపించిందంటే చాలు.. తొలుత ఆయనకే ఫోన్ చేస్తారు. బాలయ్య అక్కడకు చేరుకుని పామును ఒడిసిపట్టుకుని క్షేమంగా అడవుల్లో విడిచిపెడుతున్నాడు. ఈయనకు గ్రామపంచాయతీ కొంత స్థలాన్ని కేటాయించింది. ఇందులో ఆయన చిన్నవ్యాపారం చేసుకుంటూ పాములను పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. చిన్నతనంనుంచి పాములను పట్టడం అలవాటుగా చేసుకున్నాడు. అనంతరం విషపూరిత పాములను సైతం చాకచక్యంతో పట్టుకుని వాటికి హానికలగకుండా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేవాడు. అలా పాములను పట్టడం వృత్తిగా మార్చుకున్నాడు. ఇంట్లో, పాఠశాలల్లో, పొలాల్లో, కార్యాలయాల్లో.. ఎక్కడ విషపూరిత పాము ఉన్నా అక్కడకు బాలయ్య రావాల్సిందే. ఇలా చేయడంతో సంబంధిత వ్యక్తులనుంచి కొంతమొత్తం స్వీకరిస్తాడే తప్ప ఇంతకావాలని డిమాండ్ చేయడు. ముఖ్యంగా మహేంద్రగిరులు, మెట్టలు ఎక్కువగా ఉన్న ఈప్రాంతంలో పాములు ఎక్కువగా బయటకు వస్తుంటాయి. సోంపేట, ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు ప్రాంతాలకు కూడా బాలయ్య వెళ్లి పాములను పట్టి క్షేమంగా విడిచిపెడుతున్నాడు