పోర్టు ఆధారిత పరిశ్రమలు తీసుకువచ్చి ఏపీని అభివృద్ధి పథంలో నిలుపుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గడచిన ఐదేళ్లలో 227 ఎంఓయూలు జరిగినా పైసా పెట్టుబడి రాష్ట్రానికి రాలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పన్నులు, కరెంటు ఛార్జీలు పెంచటం వల్ల పరిశ్రమలు, ఎవరూ మనుగడ సాధించలేని పరిస్థితి ఉందని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా అప్పులు పెట్టారని విమర్శలు చేశారు. 1995 కంటే ముందు లైసెన్స్ రాజ్ కారణంగా పెట్టుబడులు రాలేదని గుర్తుచేశారు. ఆ తర్వాత ఆర్ధిక సంస్కరణల కారణంగా ఏపీలోనూ ఐటీని ప్రోత్సహించగలిగామని ఉద్ఘాటించారు. ప్రతీ నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు తెలుగువారే ఉన్నారంటే అప్పటి విధానపరమైన నిర్ణయమేనని సీఎం చంద్రబాబు తెలిపారు.