అయిదు నెలల కూటమి పాలన గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘అప్పుల జాతర–సంక్షేమానికి పాతర‘ అన్నట్లుగా ఉందని, ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, ప్రశ్నించిన వారిని అక్రమంగా నిర్బంధించడం తప్ప ప్రజలకు చేసిందేం లేదని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అయిదు నెలల్లో రూ.57 వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్ హామీలను కూడా గాలికొదిలేసిందని చెప్పారు. బడ్జెట్‌లో మూడు పథకాలకు ఏ కేటాయింపులు లేకపోగా, మరో మూడింటికి నామమాత్రంగా నిధులు కేటాయించారని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే రూ.74 వేల కోట్లు కావాలన్న ఆయన, బడ్జెట్‌లో ఆ ప్రస్తావన లేదని గుర్తు చేశారు.