రుషికొండ ప్యాలెస్‌లో విలాస వస్తువులు చూస్తే.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందేనని భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం తీరు చూస్తే ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. గురువారం అసెంబ్లీలో రుషికొండ ప్యాలెస్‌పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.‘‘తలుపుల కోసం రూ.31 లక్షలు, బాత్‌రూమ్‌లో కమోడ్ కోసం రూ.11 లక్షలు వినియోగించారు. రుషికొండ ప్యాలెస్‌లో వాడినంత ఖరీదైన ఫర్నిచర్ నేనెక్కడా చూడలేదు’’ అని విష్ణుకుమార్‌రాజు ఆవేదన వ్యక్తం చేశారు. రుషికొండపై అధికార దుర్వినియోగానికి జగన్‌ను జీవితాంతం జైలులో ఉంచినా తప్పులేదని వ్యాఖ్యానించారు. పర్యాటక భవనాల ముసుగులో నిర్మాణాలు అతిపెద్ద ఆర్థిక కుంభకోణమన్నారు. తెదేపా ఎమ్మెల్యే రఘురామ మాట్లాడుతూ రుషికొండ నిర్మాణాలను జగన్ కట్టుకున్న రాజకీయ సమాధిగా పరిగణించాలన్నారు. ఆ నిర్మాణాలను కూల్చివేయకుండా నియంత కట్టుకున్న విలాస భవనాలు ఇవి అని ప్రజలకు తెలిసేలా వారిని సందర్శనకు అనుమతించాలని ప్రభుత్వానికి సూచించారు.