ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏపీహైకోర్టు ఎంప్లాయూస్ అసోసియేషన్ ప్రతినిధుల ఇవాళ(గురువారం) లేఖ రాశారు. జగన్ ప్రభుత్వం పీఆర్సీ కమిటీ వేసినా... నివేదిక ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి, కొత్త పీఆర్సీని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో I.Rని మంజూరు చేయాలని తాము కోరుతున్నామని అన్నారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచేలా చూడాలని కోరారు. హైకోర్టు విభజన సమయంలో, తక్కువ వ్యవధిలో, తెలంగాణ నుంచి ఉద్యోగులందరూ కుటుంబాలను విడిచిపెట్టి ఆంధ్ర ప్రదేశ్‌కు వచ్చారని తెలిపారు. వారికి తగిన వసతి కల్పించడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయన్నారు. హైకోర్టు ఉద్యోగులకు నామమాత్రపు చెల్లింపు ప్రాతిపదికన ఇంటి స్థలాలను కేటాయించడానికి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రోజువారీ జీవన వ్యయంలో భారీ పెరుగుదల దృష్ట్యా పెండింగ్‌లో ఉన్న డీఏలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. కాగా.. హైకోర్టు ఉద్యోగులు కొన్ని రోజుల క్రితం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వినతిపత్రం అందజేశారు. వేతన సవరణ కమిటీ(పీఆర్‌సీ)ని ఏర్పాటు చేసి, ఆరునెలల్లో కొత్త పీఆర్‌సీ అమలు చేయాలని కోరారు. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, హైకోర్టు విజ్ఞప్తికి అనుగుణంగా అదనపు ఉద్యోగాలు మంజూరు చేయాలని కోరారు.