క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి రాజ్యాన్ని ఏలితే ఎవ్వరినైనా బలి చేస్తారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం ఏపీ డిప్యూటీ స్పీకర్ కె. రఘురామకృష్ణరాజు ప్రకటన అనంతరం డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఉండకూడదని 2014లో వారిని నిలువరించామన్నారు. అయితే 2019లో అలా కుదరలేదని.. ఆ సమయంలో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరిగాయని చెప్పారు. ఆ క్రమంలో సుప్రీంకోర్టు జడ్జీలు, పార్టీల్లోని కార్యకర్తలు, సొంత పార్టీ ఎంపీ అయిన ట్రిపుల్ ఆర్‌ను వారు వదల లేదన్నారు. ఆయన్ని శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా హింసించారని గుర్తు చేశారు. ఆ సమయంలో ట్రిపుల్ ఆర్‌ను అరెస్ట్ చేస్తారనుకున్నాం.. కానీ థర్డ్ డిగ్రీ మెథడ్ వాడడంతో భయం కలిగిందన్నారు. దీంతో తమకు ఆవేదన కలిగిందని చెప్పారు.అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదన్న తన కోరిక వల్లే.. నేడు డిప్యూటీ స్పీకర్‌గా మిమ్మల్ని చూస్తున్నామని పవన్ పేర్కొన్నారు. అందరం కలసి ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు ఈ సభకు ధన్యవాదాలు తెలిపారు. ఇక మీ మాటకు పదనుతోపాటు హస్యం సైతం ఉంటుందన్నారు.కర్మ ఎవ్వరిని వదలదు... మీ నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వమన్న వారు ఇప్పుడు సభకు రాలేక పోయారంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను పరోక్షంగా విమర్శించారు. ప్రస్తుతం మమ్మల్ని ఎదుర్కొవాలంటే వారికి భయం కలుగుతుందన్నారు. సీఎం చంద్రబాబును సైతం ఇబ్బందులు పాలు చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో తాను సైతం ఎంతో ఆవేదన చెందానని చెప్పారు.