పర్యాటక శాఖ ద్వారా గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని జేసీ, ఐటీడీఏ పీవో పి.ధాత్రిరెడ్డికి కొండ రెడ్లు విన్నవించారు. బుట్టాయగూడెం ఐటీడీఏలో బుధవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో పోలవరం మండలం కొరుటూరు, చీడూరు, టేకూరు, తెల్లదిబ్బలు గ్రామాలకు చెందిన కొండరెడ్లు వినతిపత్రం అందజేశారు. గతంలో ఏపీ టూరిజం ద్వారా ఉపాధి పొందిన తాము గ్రామాలు ఖాళీకావడంతో ఉపాధి కోల్పోయామని రాంగోపాల్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, పోసిరెడ్డి, పోసిబాబురెడ్డి, సాంబశివరెడ్డి, వెంకటరెడ్డి, రాంబాబురెడ్డి తదితరులు వివరించారు. పాపికొండల విహార యాత్ర కు వచ్చే యాత్రికులకు సేవలందించడం ద్వారా ఉపాధి పొందేవారమన్నారు. కొరుటూరు, శిరివాకలో కాటేజీలు శిథిలయమయ్యాయని, తిరిగి నిర్మించాలని కోరారు. జేసీ కొండరెడ్ల ఉపాధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏజెన్సీలో ఆదివాసీల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవా లని ఆదివాసీ సంఘాల నాయకులు కోరారు. పలువురు గిరిజనులు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. అన్ని ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటా మని పీవో ధాత్రిరెడ్డి హామీ ఇచ్చారు.