సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో కేసుల పర్వం కొనసాగుతోంది. వైసీపీ నాయకులు, సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా పాడేరు పోలీస్‌స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే పోసానిపై ఏపీ వ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ఉచ్చు బిగుస్తోంది. పోసానిని అరెస్ట్ చేయాలంటూ పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష పార్టీ అయి టీడీపీ, జనసేన నేతలపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు చేశారని.. అతడిని అరెస్ట్ చేయాలని కేసులు నమోదు అవుతున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై సోషల్ మీడియాలో పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో ఆయనపై ఫిర్యాదు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కరోజే పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 22 కేసులు నమోదు అయ్యాయి. టీడీపీ, జనసేన నేతలు పోసాని వివిధ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. వీటిలో ఐదుచోట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతపురంలో పోసాని దిష్టి బొమ్మను తెలుగు యువత, ఎస్సీ సెల్ నాయకులు దహనం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను అసభ్యకరంగా దూషించారంటూ నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని పోసానికి రెండు, మూడు రోజుల్లో నోటీసులు జారీ చేస్తామని విజయవాడ భవానీపురం పోలీసులు తెలిపారు. అలాగే శ్రీకాకుళం పాతపట్నం పోలీస్‌స్టేషన్‌లో పోసానిపై శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కలమట వెంకటరమణ ఫిర్యాదు చేశారు.