ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం, ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఢిల్లీలో ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. చంద్రబాబు తన ఢిల్లీలో పర్యటనలో కేంద్రమంత్రులను కలిశారు. హస్తినలో సీఎం పర్యటన వివరాలను టీడీపీ యువ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాకు తెలిపారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తో చంద్రబాబు సమావేశమయ్యారని వెల్లడించారు. భారత్ నుంచి అమెరికా వెళ్లే విద్యార్థులు, పౌరుల స్థితిగతులపై జైశంకర్ తో చర్చించారని... ముఖ్యంగా మనవాళ్లు ఎదుర్కొనే ఇమ్మిగ్రేషన్ సమస్యలు పరిష్కరించాలని కేంద్రమంత్రిని చంద్రబాబు కోరారని శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీని అమలు చేస్తున్న విషయాన్ని చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని, విదేశీ కంపెనీలను ఏపీకి పంపించేందుకు సహకరిస్తామని కేంద్రం నుంచి హామీ లభించిందని తెలిపారు. అమరావతి నిర్మాణంలో సింగపూర్ ఎంతో కీలకమని, సింగపూర్ తో భాగస్వామ్యాన్ని పునరుద్ధరించాలని చంద్రబాబు కోరగా... విదేశాంగ మంత్రి జైశంకర్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. చంద్రబాబు తన ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కూడా కలిశారని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఏపీలో వ్యవసాయ రంగానికి గోదావరి-పెన్నా ప్రాజెక్టు ఎంతో కీలకమన్న విషయాన్ని చంద్రబాబు... కేంద్రానికి వివరించారని... ఈ ప్రాజెక్టుకు సహకరించాలని చంద్రబాబు చేసిన విజ్ఞాపనకు కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిందని వెల్లడించారు. మొత్తమ్మీద చంద్రబాబు ఢిల్లీ పర్యటన విజయవంతమైందని శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. కాగా, చంద్రబాబు ఢిల్లీ నుంచి మహారాష్ట్ర వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఆయన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు.