కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.శుక్రవారం ప్రారంభమైన కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం అంటే నవంబర్ 16న గంధం కార్యక్రమం నిర్వహిస్తారు. నవంబర్ 17న కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవం ఉంటుంది. నవంబర్ 18న ముుషాయిరా ఉంటాయని దర్గా నిర్వాహకులు వెల్లడించారు. అలాగే నవంబర్ 20వ తేదీ రాత్రి పది గంటలకు ఊరేగింపు ఉంటుంది. కడప పెద్ద దర్గా ఉత్సవాల కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు. నవంబర్ 16వ తేదీ రాత్రి పదిగంటలకు ఆరిఫుల్లా హుస్సేనీ నివాసం నుంచి గంధం తెస్తారు. నవంబర్ 17న రాత్రి 8 గంటలకు ఉరుసు ఉత్సవం జరుగుతుంది.
కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక , మహారాష్ట్రల నుంచి కూడా పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. పెద్ద దర్గాగా పిలిచే అమీన్ పీర్ దర్గాలో ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. మరోవైపు కడప పెద్ద దర్గా ఉరుసు నేపథ్యంలో రేపు (నవంబర్ 16) కడపలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కడప పెద్ద దర్గాలో ఏటా ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అలాగే ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కడప దర్గాకు హీరో రామ్ చరణ్
మరోవైపు కడప పెద్ద దర్గాకు హీరో రామ్ చరణ్ రానున్నట్లు తెలిసింది. కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు నిర్వాహకులు ప్రముఖులను ఆహ్వానిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హీరో రామ్‌చరణ్‌ను కూడా ఆహ్వానించినట్లు తెలిసింది. అయితే గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌లో ఉన్న రామ్‌చరణ్.. వీలు చూసుకుని వస్తానని చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నవంబర్ 18వ తేదీ జరిగే ముషాయరా ఈవెంట్‌కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిసింది. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది. అందుకు తగినట్టుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం మాలలో ఉన్నారు. దీంతో కడప పెద్ద దర్గాకు వస్తారా లేదా అనేదీ కూడా సందేహంగా మారింది.