అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరం తీర్చిదిద్దడంతో పాటు వివిధ రంగాల్లో అధునాతన సాంకేతికత, పరిశోధనల ఫలాలను ఏపీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు దేశంలోనే పేరెన్నిగన్న రీసెర్చి ఇనిస్టిట్యూట్ అయిన ఐఐటీ మద్రాస్ తో కూటమి ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, అత్యాధునిక పరిశోధనలు నిర్వహించడం, సమాజానికి ప్రయోజనం చేకూర్చే సామాజిక సంబంధిత కార్యకలాపాల్లో ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని ఐఐటీ మద్రాస్ నిర్ణయించింది. ఐఐటీ-ఎం ప్రతినిధులతో ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయి. సాయంత్రం ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఐఐటీ మద్రాస్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల నడుమ కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగూరు నారాయణ, మండిపల్లి రాంప్రసాదర్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, ఉన్నతాధికారులు కృతికా శుక్లా, విజయరామరాజు, యువరాజ్, కన్నబాబు, ఐఐటీ మద్రాస్ డైరక్టర్ ప్రొఫెసర్ విజినాథన్ కామకోటి, డీన్ ఆఫ్ ప్లానింగ్ రామానుజం సారథి, ఎంజే శంకర్ రామన్ (సీఈవో, ఐఐటీ-ఎం ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్), ప్రొఫెసర్ మహేష్ పంచాగ్నుల (మాజీ డీన్, ఐఐటీ-ఎం కార్పొరేట్ రిలేషన్స్), ప్రొఫెసర్ రవీంద్రన్ (హెడ్, సెంటర్ ఫర్ రెస్పాన్సిబిల్ ఎఐ), రాజేష్ (ఐఐటీ-ఎం అల్యూమినస్), చెన్నై సీఎంవో అధికారి రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.