ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం బేసిక్ ప్రైస్ (కనీస ధర) నిర్ణయానికి టెండర్ కమిటీ ఏర్పాటు చేసింది. మద్యం సరఫరా కంపెనీల నుంచి ఏపీఎస్‌బీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్) కొనుగోలు చేసే వివిధ బ్రాండ్ల మద్యానికి చెల్లించాల్సిన బేసిక్ ప్రైస్ (కనీస ధర)ను నిర్ణయించేందుకు రాష్ట్రప్రభుత్వం ఈ టెండరు కమిటీని నియమించింది. ఈ కమిటీలో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్ చౌదరి ఛైర్మన్ కాగా.. ఛార్టర్డ్ అకౌంటెంట్ మీనవల్లి మాచర్ రావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీఆర్ మీనా సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ మద్యం కొనుగోలుకు కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వానికి సూచించనుంది. కొత్త బ్రాండ్లకు ఎమ్మార్పీలు ఖరారు చేయడంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ప్రధానంగా చిన్న సీసాలు, టెట్రా ప్యాక్‌లు ప్రవేశపెట్టడంపై కమిటీ సిఫార్సు చేయనుంది. దీంతో పాటు కమిటీ నిర్వహించాల్సిన విధులు, బాధ్యతలను వివరిస్తూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం మీద ఈ కమిటీ త్వరలోనే బేసిక్ ప్రైస్‌ను ఖరారు చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది. గత నెలలో లాటరీ ద్వారా షాపుల్ని కేటాయించిన సంగతి తెలిసిందే.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త షాపుల్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం రూ.99కే క్వార్టర్ మద్యం బాటిల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే గతవారం మద్యం షాపుల్లో కొన్ని బ్రాండ్ల మద్యం, బీర్లకు కొరత వచ్చిందని చెబుతున్నారు. మద్యం షాపుల నుంచి వ్యాపారులు ఆర్డర్ పెడుతున్నా.. ఆయా బ్రాండ్ల డిమాండ్ మేరకు సరఫరా కావడం లేదంటున్నారు.
రాష్ట్రంలో మద్యం షాపుల్లో ఇంపీరియల్ బ్లూ, మెక్ డోవెల్స్ వంటి బ్రాండ్లకు కొరత వచ్చిందని చెబుతున్నారు. బీర్లలో కింగ్‌ఫిషర్, బడ్‌వైజర్ వంటి బ్రాండ్లకు కొరత ఏర్పడింది అంటున్నారు. మద్యం షాపుల యజమానులు పది కేసులకు ఆర్లరు పెడితే కనీసం ఒక్క కేసు కూడా రావడం లేదని చెబుతున్నారట. మరోవైపు బెల్టు షాపులు, అధిక ధరకు మద్యం అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది ప్రభుత్వం.. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటుగా షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.
ఇదిలా ఉంటే కొత్త మద్యం షాపుల దక్కించుకున్నవారు తమకు మార్జిన్ సరిగా రావడం లేదని చెబుతున్నారు. తాము 20శాతం వరకు మార్జిన్ వస్తుంది అనుకుంటే.. తామకు 8 నుంచి 10శాతం వరకే వస్తుందంటున్నారు. ఇలాగైతే తాము వ్యాపారాలు చేయలేమని.. మార్జిన్ పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.. ఈ మేరకు లేఖ కూడా రాశారు మద్యం వ్యాపారలుు.