చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో గురువారం అర్ధరాత్రి వైయస్ఆర్సీపీ నేత గోవిందప్ప కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది. కిడ్నాపర్ల నుంచి వారిని పోలీసులు రక్షించారు. ఆ సమయంలో కిడ్నాపర్లు పరారయ్యారు. బాధితుల కథనం మేరకు.. మండలంలోని పెద్దకురబలపల్లిలోని వైయస్ఆర్సీపీ కి చెందిన మాజీ సర్పంచ్ గోవిందప్ప కుటుంబాన్ని గురువారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. మూడు లగ్జరీ కార్లలో వచ్చిన ఆగంతకులు గన్లతో బెదిరించి గోవిందప్ప కుటుంబసభ్యుల్ని కారుల్లో ఎక్కించుకున్నారు. గోవిందప్ప, గంగమ్మ, మాధవమ్మ, సుబ్బక్క, సిద్ధప్ప, సోమశేఖర్, పునీత్లను కారుల్లో ఎక్కించుకుని రామకుప్పం వైపు బయలుదేరారు.
తాము ఆదాయపన్ను అధికారులమని, మీ దగ్గర ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఫిర్యాదు అందిందని గోవిందప్పకు చెప్పారు. మీవద్ద దాచిన నగదు ఇస్తే పంచుకుని వదిలేస్తామని ఆఫర్ ఇచ్చారు. విజలాపురం సమీపంలో గోవిందప్ప తమ్ముడు జయరఘురాం కోసం వాకబు చేశారు. తన తమ్ముడు ఇంటివద్దే ఉన్నట్లు గోవిందప్ప చెప్పడంతో మళ్లీ పెద్దకురబలపల్లి వెళ్లారు. అక్కడ జయరఘురాం లేకపోవడంతో కార్లను రామకుప్పం వైపు తీసుకెళ్లారు. రామకుప్పంలోని వైయస్ఆర్ సర్కిల్లో బీట్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లను గమనించిన ఆగంతకులు కుటుంబం మొత్తాన్ని ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు పోలీసులకు చెప్పాలని బాధితులను బెదిరించారు. ముందు రెండు కార్లను ఆపిన పోలీసులకు బాధితులు ఆవిధంగానే చెప్పారు. అయినా అనుమానించిన పోలీసులు అందరినీ కిందికి దించి ప్రశ్నించసాగారు. ఈ నేపథ్యంలో ఆ రెండు కార్లలోని కిడ్నాపర్లు పరారయ్యారు. ఆ సమయంలో వెనుక ఉన్న మూడోకారు వేగంగా ముందుకెళ్లిపోయింది. ఆ కారులో ఉన్న బాధితులు ఇద్దరిని రెండు కిలోమీటర్ల తరువాత కిడ్నాపర్లు వదిలేసి వెళ్లిపోయారు.