టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నది. శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో సమావేశమైన బోర్డు ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నది. తిరుమలలో రాజకీయ పరమైన వ్యాఖ్యానాలు చేయడాన్ని నిషేధించింది. అంతేకాక టీటీడీ బోర్డులో అన్యమతస్థులు ఉద్యోగులుగా ఉండటంపై కూడా నిషేధం విధించింది. సదరు ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించనున్నారు. సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి తొలి సమావేశం తిరుమలలో నిర్వహించారు. ఈ మీటింగ్ లో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలో శారదా పీఠానికి కేటాయించిన భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. శారదా పీఠం లీజు రద్దు చేసింది. టీటీడీలో అన్యమత ఉద్యోగుల సేవలకు చెక్ పెట్టడంతో పాటు దేవస్థానంలో అతిథి గృహాలకు సొంత పేర్లు పెట్టకూడదని నిర్ణయించింది. రెండు, మూడు గంటల్లోనే సర్వదర్శనం భక్తులకు దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది.
తిరుపతి శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ కు గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలిపిరిలో దేవలోక్ సంస్థకు కేటాయించిన 20 ఎకరాల భూమిని టీటీడీకి అప్పగించే విధంగా ప్రభుత్వానికి లేఖ రాస్తామని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అన్నప్రసాదంలో మరో ఐటమ్‌ను భక్తులకు వడ్డించాలని నిర్ణయించామన్నారు. శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యమైన నెయ్యి వినియోగించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానం చేశామన్నారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం 3:30 గంటలకు వరకు సుదీర్ఘంగా కొనసాగింది. అజెండాలోని 80 అంశాలను పరిశీలించి సభ్యులు నిర్ణయాలు తీసుకున్నారు. గత ఐదేళ్లలో పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించి కొన్నింటిని రద్దు చేశారు. సమావేశం వివరాలను బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. శ్రీనివాస సేతు పైవంతెనకు గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. శారదాపీఠం లీజును రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామన్నారు.