గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే ఏ మాత్రం పట్టించుకోలేరని హోం మంత్రి అనిత విమర్శించారు. శాసనమండలిలో సోమవారం జరిగిన సమావేశంలో పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు ఆమె వివరణ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో దిశ చట్టం గురించి గొప్పగా చెప్పుకున్నారు. అసలు ఆ చట్టం ఉందా అని ప్రశ్నించారు. దిశ యాప్, చట్టం పని చేస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయని అన్నారు. నిర్భయ చట్టాన్ని వదిలేసి.. లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చిన వైసీపీ ఏంసాధించిందన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిని అరెస్టు చేస్తున్నాం. ముచ్చుమర్రి ఘటనలో బాలికను గుర్తించడానికి సమయం పట్టిందన్నారు. పోలీసుల వైఫల్యం ఇప్పటిది కాదన్నారు.
గత ఐదేళ్లలో పోలీసులు పరదాలు కట్టడానికి, చెట్లు నరకడానికి, రోడ్ల మీద కాపలా కాయడానికి పని చేశారన్నారు. ఒక్క మహిళనైనా వారు రక్షించారా అని మండిపడ్డారు. దిశ చట్టానికి చట్టబద్ధత లేకుండా దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరంలో దిశ పోలీసు స్టేషన్ ప్రారంభించారు. అదే రోజు దళిత మహిళపై సామూహిక అత్యాచారం చేసి పోలీసు స్టేషన్ ముందు వదిలేసి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ యాప్‌తో నేరాలు తగ్గింది నిజమైతే.. రికార్డుల్లో ఎందుకు నేరాలు పెరుగుతున్నాయని అడిగారు. అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ కట్టడానికి వైకాపా హయాంలో కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు.
2014-19 మధ్య ఏపీలో 83,202 కేసులు నమోదయ్యాయని 2019-24 మధ్య 1,00,508 కేసులు నమోదయ్యాయని గడిచిన ఐదేళ్లలో మహిళలపై అఘాయిత్యాలు 20 శాతం పెరిగాయని అన్నారు. మహిళా పోలీసు స్టేషన్ల బోర్డులను దిశ పీఎస్‌లుగా మార్చారు. మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రత్యేక కోర్టులతో నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చేస్తున్నాం. మహిళా పీఎస్‌లు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి నివారణ చర్యలు తీసుకుంటున్నాం. 5 నెలల కాలంలో 24 గంటల్లోనే నిందితులను పట్టుకుని రిమాండ్‌కు పంపించామన్నారు.