తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సోమవారం నాడు 62,085 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 21,335 మంది తలనీలాలు సమర్పించారు.తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.78 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఒక కంపార్టుమెంట్ మాత్రమే భక్తులతో నిండిపోయింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్‌లో వేచివున్న భక్తులకు టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల తేదీని టీటీడీ అధికారులు ప్రకటించారు. ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఈ నెల 18వ తేదీనాడే విడుదల అయ్యాయి. ఉదయం 10 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. బుధవారం ఉదయం 10 గంటల వరకు అవి తెరిచి ఉంటాయి.ఈ లోగా భక్తులు తమ పేరు, ఇతర వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. 2025 ఫిబ్రవరిలో శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొన దలిచిన భక్తుల కోసం టికెట్లు ఈ నెల 21వ తేదీన ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ఈ కోటా టికెట్లు అందుబాటులో ఉంటాయి.
శ్రీవారి కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ వంటి సేవలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను 21వ తేదీ నుంచి భక్తులు బుక్ చేసుకోవచ్చు. అలాగే- వర్చువల్ విధానంలో శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరలో పాల్గొనదలిచిన వారి కోసం అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు బుకింగ్ అందుబాటులో ఉంటుంది.తిరుమలలో అంగప్రదక్షిణం చేయదలిచిన భక్తులకు ఉద్దేశించిన ఆన్‌లైన్ టోకెన్లు 23వ తేదీన ఉదయం 10:00 నుంచి అందుబాటులో ఉంటాయి. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ అవుతుంది. తమ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నంబర్ ద్వారా భక్తులు వాటిని బుక్ చేసుకోవచ్చు.