ఏపీ అసెంబ్లీలో నేడు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని ప్రాజెక్టులపై సభ్యులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఏపీకి అమరావతి, పోలవరం రెండు కళ్లు లాంటివని అభివర్ణించారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి గేమ్ చేంజర్ అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు కచ్చితంగా 45.72 మీటర్లు ఉంటుందని స్పష్టం చేశారు. గత జలవనరుల శాఖ మంత్రికి టీఎంసీకి, క్యూసెక్కులకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. పోలవరం గురించి అడిగితే పర్సెంటా, హాఫ్ పర్సెంటా అని హేళనగా మాట్లాడారని మండిపడ్డారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేవలం 3.08 శాతం పనులే చేసిందని అన్నారు. 2014-19 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టుపై రూ.16,493 కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు వెల్లడించారు. గత సర్కారు పోలవరంపై ఖర్చు చేసింది రూ.4,099 కోట్లేనని తెలిపారు. ఏపీకి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, రెండేళ్లలో రూ.12,157 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించిందని చంద్రబాబు పేర్కొన్నారు. జనవరి నుంచి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పారు. డయాఫ్రం వాల్ నిర్మాణం 2026 మార్చి లోపు పూర్తవుతుందని అన్నారు. 2027 లోపు పోలవరం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు.