అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని కూటమి నేతలు గుర్తుంచుకోవాలని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజని అన్నారు. నరసరావుపేట జైల్లో ఉన్న వైసీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డిని ఈరోజు రజని పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 75 ఏళ్ల కోటిరెడ్డి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే ఆయనపై అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపారని రజని అన్నారు. అధికారులను కోటిరెడ్డి కొట్టినట్టు, కులం పేరుతో దూషించినట్టు అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. ఒక నాయకుడు ఫోన్ చేస్తే అక్రమ కేసు బనాయించారని దుయ్యబట్టారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని రాజకీయ నాయకులు, పోలీసులు గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. పక్కా పథకం ప్రకారం వైసీపీ నేతలను జైలుకు పంపుతున్నారని అన్నారు.రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మహిళలపై దారుణాలు జరుగుతున్నాయని రజని చెప్పారు. మహిళలపై జరుగుతున్న దాడులపై దృష్టి పెట్టకుండా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు.