కొన్ని అంతర్జాతీయ సంస్థలు.. హిందూ దేవుళ్లను అసభ్యకరమైన రీతిలో ప్రదర్శించిన ఘటనలు వెలుగుచూసిన ప్రతీసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అయినప్పటికీ ఇతర కంపెనీలు మళ్లీ అలాంటి పనులే చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఇప్పటికే వివిధ రకాల వస్తువులపై హిందువుల బొమ్మలు ప్రింట్ చేసి విక్రయించిన సంస్థల హిందూ సంఘాల ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికన్ సంస్థ వాల్‌మార్ట్ హిందువులకు తీవ్ర ఆగ్రహం తెప్పించే పనిచేసింది. చెప్పులు, డ్రాయర్లు, షార్ట్స్, స్విమ్ సూట్ సహా పలు రకాల దుస్తులపై హిందువులు ఆది దేవుడిగా కొలుచుకునే విఘ్నేశ్వరుడి బొమ్మను ప్రింట్ చేసి మార్కెట్లోకి విడుదల చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాశంగా మారింది.
గణేశుడి బొమ్మతో కూడిన చెప్పులు, లోదుస్తులు, ఇతర దుస్తులను విక్రయిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన తర్వాత వాల్‌మార్ట్ వివాదంలో మునిగిపోయింది. దీనిపై అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తు చేస్తున్నాయి. వాల్‌మార్ట్ సంస్థ.. హిందూ సమాజం మనోభావాలను ఎలా దెబ్బతీస్తోందో సోషల్ మీడియాలో ఎత్తి చూపారు. ఇలా చేయడం ఆమోదించదగింది కాదని.. హిందూ దేవుళ్లను కించపరచలేరని హిందూ సంఘాలు పోస్టులు పెడుతున్నారు. మహిళలు వేసుకునే స్విమ్ సూట్లు, అండర్‌వేర్‌లు, పురుషుల ప్యాంట్లు, షార్ట్‌లు, బికినీలు, చెప్పులు, సాక్స్‌లపై గణేషుడి చిత్రాలను ప్రింట్ చేసి వాల్‌మార్ట్ సంస్థ విక్రయిస్తోంది. ఇలా కనీసం 70 రకాల వస్తువులతో కూడిన వాటిపై గణేషుడి బొమ్మలను ఉంచి వాల్‌మార్ట్ తన విక్రయాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వాల్‌మార్ట్ చేసిన పనికి హిందూ సమాజం తీవ్ర ఆగ్రహంతో ఉంది. హిందూ మనోభావాలను అపహాస్యం చేయడంపై సోషల్ మీడియా వేదికగా వాల్‌మార్ట్ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ కార్యకర్త రాజమ్ జెడ్.. ఆ చిత్రాలను తొలగించాలని కోరుతూ అమెరికన్ రిటైల్ కార్పొరేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఏ మతానికి చెందిన విశ్వాసాలు గానీ, చిహ్నాలు గానీ తప్పుగా చూపకూడదని ఆయన పేర్కొన్నారు. ఇక హిందూ సమాజం దీని గురించి చాలా ఆందోళన చెందుతోందని.. ఇది తీవ్రమైన నిర్లక్ష్యం అని.. హిందూ న్యాయవాద సంస్థ ఇన్‌సైట్ యూకే ట్వీట్ చేసింది. హిందూ దేవుళ్ల పట్ల, హిందువుల మనోభావాలపై పూర్తి గౌరవం లేకపోవడం దారుణం అని మండిపడింది.
అండర్‌వేర్‌లు, బాక్సర్లు, సాక్స్, చెప్పులు, స్విమ్ సూట్లపై గణేషుడి బొమ్మలు ఉంచడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కలిచివేసే విషయం అని.. అగౌరవపరిచేదిగా ఉందని హిందూ జాగృతి సంస్థ పేర్కొంది. దీనిపై వాల్‌మార్ట్ సంస్థ అధికారికంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇక ఈ ఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ అమెరికాకు చెందిన హిందూ న్యాయవాద సంస్థ హెచ్ఐఎఫ్ నేరుగా వాల్‌మార్ట్ యాజమాన్యానికి లేఖ రాసింది.
వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పిన వాల్‌మార్ట్
ఇక సోషల్ మీడియాలో తమ కంపెనీ తయారు చేసిన దుస్తులకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడం.. అందులో గణేషుడి చిత్రాలను అసభ్యకరంగా చూపించడంపై హిందూ సంఘాల నుంచి వెల్లువెత్తుతున్న తీవ్ర ఆగ్రహంపై సదరు వాల్‌మార్ట్ సంస్థ స్పందించింది. ఈ ఘటనపై బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. దీనిపై వెనక్కి తగ్గిన వాల్‌మార్ట్ సంస్థ.. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని తేల్చి చెప్పింది.
అయితే ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. 2022 ఏప్రిల్‌లో.. సహారా రే స్విమ్ అనే బట్టల బ్రాండ్ సంస్థ తయారు చేసిన స్విమ్ సూట్‌లపై హిందూ దేవతల చిత్రాలను ముద్రించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అంతకుముందు 2019 మేలో పవిత్ర హిందూ దేవుళ్లు, దేవతల ఫోటోలు ఉన్న ఫ్లోర్ మ్యాట్‌లు, టాయిలెట్ కవర్లు అమెజాన్‌లో విక్రయిస్తుండటం పెను సంచనలంగా మారింది.