భారత్‌కు మిత్ర దేశాల్లో ఒకటైన బంగ్లాదేశ్ ఇప్పుడు శత్రుదేశంగా మారుతోంది. పాలు పోసి పెంచితే పాము అయిందన్న చందంగా తయారవుతోంది. ఒకప్పుడు పాకిస్తాన్‌లో భాగంగా ఉన్న బంగ్లాదేశ్‌ను పాక్ చెర నుంచి విడిపించి స్వతంత్య్ర దేశంగా ఏర్పడటంతో భారత్ ఎనలేని కృషి చేసింది. బంగ్లాదేశ్ తరఫున యుద్ధంలోకి దిగి.. పాక్ సైన్యంతో పోరాడి విజయం సాధించి.. బంగ్లాదేశ్‌కు ముక్తి కల్పించింది. అయితే అప్పటి నుంచి భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు సరిగ్గా 50 ఏళ్ల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
బంగ్లాదేశ్ రాజకీయాల నుంచి మాజీ ప్రధాని షేక్ హసీనా వైదొలిగి దేశం విడిచి పారిపోయి భారత్‌లో తలదాచుకోవడం, ఆ దేశంలో షేక్ హసీనా కుటుంబం పట్ల తీవ్ర వ్యతిరేకత, వాళ్ల గుర్తులు, ఆనవాళ్లు కూడా లేకుండా చేస్తున్నారు. అదే సమయంలో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం.. భారత్‌కు వ్యతిరేకంగా మారుతూ.. పాకిస్తాన్‌కు దగ్గరవుతోంది. మరోవైపు.. బంగ్లాదేశ్‌లోని మైనారిటీలు, మరీ ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. హిందూ సంఘాలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి.
ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ రచయిత తస్లీమా నస్రీన్.. ప్రస్తుత పరిస్థితులపై చేసిన ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా 1971లో జరిగిన బంగ్లాదేశ్ విముక్తి యుద్ధాన్ని ప్రస్తావించిన తస్లీమా నస్రీన్.. శత్రుదేశమైన పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌ను రక్షించడానికి భారత్ 17 వేల మంది సైనికులను కోల్పోయిందని గుర్తు చేశారు. అలాంటి బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్‌కు శత్రుదేశంగా మారింది అని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ యుద్ధం సమయంలో బంగ్లాదేశ్‌కు భారత్.. సైనిక, మానవతా సహాయాన్ని అందించిందని గుర్తు చేశారు.
పాకిస్తాన్ సైన్యం నుంచి బంగ్లాదేశ్‌ను రక్షించడానికి ఆయుధాలు, శిక్షణ పొందిన పోరాట యోధులను అందించిన భారత్ ఇప్పుడు శత్రుదేశంగా మారిందని పేర్కొన్నారు. అదే సమయంలో 30 లక్షల మందిని చంపి, 2 లక్షల మంది మహిళలపై అత్యాచారం చేసిన పాకిస్తాన్ ఇప్పుడు మిత్ర దేశంగా మారిందని తస్లీమా నస్రీన్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. యుద్ధం సమయంలో కోటి మంది శరణార్థులకు కూడు, గూడు, గుడ్డ అందించి ఆదుకున్న భారత్ ఇప్పుడు శత్రువుగా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక మంది ఉగ్రవాదులను తయారు చేస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్‌కు మిత్ర దేశంగా మారిందని ఆమె మండిపడ్డారు. ఇక 1971లో బంగ్లాదేశ్‌లో చేసిన మారణహోమానికి ఇప్పటికీ క్షమాపణ చెప్పని పాకిస్తాన్ ఇప్పుడు స్నేహపూర్వక దేశంగా ఉందని తస్లీమా నస్రీన్ విమర్శలు గుప్పించారు.