యాంకర్ హబ్ కింద తిరుపతి కేంద్రంగా చుట్టుపక్కల ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఏ మూల నుంచైనా సులువుగా జిల్లాలోని పర్యాటక గమ్య స్థానాలను చేరుకునేలా రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలకు వీలు కల్పించనుంది. సామాన్య యాత్రికులను దృష్టిలో వుంచుకుని షటిల్ బస్సులు, రెంటల్ బైక్లు వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించనుంది. పర్యాటక గమ్యస్థానాలు చేరే క్రమంలో మార్గాల వెంబడీ పార్కింగ్ లాట్స్, పరిశుభ్రమైన రెస్ట్ రూమ్స్, తాగునీరు, స్పష్టమైన సూచిక బోర్డులు వంటి సదుపాయాలు ఏర్పాటు చేయనుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ కింద హైవే నిర్మాణాలు, హోటళ్లు, ఆధునిక రవాణా సదుపాయాలు వంటివి కల్పించనుంది. మరోవైపు పర్యాటక రంగం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఆసక్తి ఉన్న యువతకు ఆతిథ్య రంగంలోనూ, హస్త కళలలోనూ, టూర్ ఆపరేషన్లలో శిక్షణ ఇవ్వనుంది.