ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు పోలవరం పర్యటనకు వెళుతున్నారు. డిసెంబరు 16న ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. గతంలో తాము 2014-19 మధ్య ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించి, పనులను సమీక్షించేవారు. ఇప్పుడు కూడా అదే ఆనవాయతీ కొనసాగిస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జూన్ 17న పోలవరం వెళ్లారు. ఆ రోజు కూడా సోమవారమే. ఇప్పుడు డిసెంబరు 16వ తేదీ కూడా సోమవారమే. ఇక, తన తాజా పర్యటన సందర్భంగా... చంద్రబాబు పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ నిర్మాణం గురించి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకోనున్నారు. జనవరి 2 నుంచి కొత్త డయాఫ్రం వాల్ నిర్మించనుండగా, దానిపై ఇంజినీర్లతో మాట్లాడనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.