ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు పింఛను ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో పింఛన్ల గురించి చర్చ జరిగింది.. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే మూడు నెలల్లో తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారుల వివరాలు సేకరించి పింఛన్‌లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి ఏటా జాబితాను సిద్దం చేసి అప్డేట్ చేయాలన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తామన్నారు.
అమరావతి వెలగపూడి సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజు పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణపేదరిక నిర్మూలన శాఖలపై ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషన్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే పింఛన్‌లు అర్హత లేనివారికి వస్తున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయన్నారు. రెండు రోజుల పాటూ నిర్వహించిన సర్వేలో ప్రతీ పదివేలకూ 500 మంది వరకూ అనర్హులని తేలినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు 6 లక్షల మందికి హడావుడిగా పింఛన్‌లు ఇచ్చారని.. ఇందులో చాలా మంది అనర్హులే ఉన్నారని వ్యాఖ్యానించిన మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. వచ్చే మూడు నెలల్లోగా ప్రతీ పింఛన్‌ను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. దివ్యాంగులకు సంబంధించి సదరం ధృవీకరణ పత్రాలను అర్హులకే దక్కేలా చూడాలన్నారు. అర్హత లేనివారికి ఇవ్వకుండా చూడాలన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సరికొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు.. ఈ మేరకు ట్వీట్ చేశారు. 'రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో ఆరు నెలలు గడిచింది. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చేందుకు నేను, నా మంత్రివర్గ సహచరులు కృషి చేస్తున్నాం. ఈ ఆరు నెలల్లో గాడి తప్పిన వ్యవస్థల్ని సరిదిద్దాం. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనతో వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం. 'రాష్ట్రమే ఫస్ట్...ప్రజలే ఫైనల్' అనే నినాదంతో ప్రతిక్షణం ప్రజలకు మంచి చేసేందుకు పనిచేస్తున్నాం. చేయాల్సింది ఎంతో ఉందనే బాధ్యతను గుర్తెరిగి.. ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. మీ ఆశీస్సులు, భాగస్వామ్యంతో.. స్వర్ణాంధ్ర - 2047 విజన్ తో ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ 1 గా నిలబెడతాం'అన్నారు.
'రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయ్యింది. ఐదేళ్లలో విధ్వంసమైన రాష్ట్రం, అస్తవ్యస్తమైన వ్యవస్థలు, అప్పులు వారసత్వంగా వచ్చాయి. సంక్షోభాలను అవకాశాలుగా తీసుకొని సంక్షేమంగా మలిచే చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచీ రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తోంది. పిచ్చిపిచ్చి రంగులు ఉండవు.. మా బొమ్మలు కనిపించవు.. పబ్లిసిటీ కంటే రియాలిటీకే మా ప్రాధాన్యం. 'రాష్ట్రమే ఫస్ట్...ప్రజలే ఫైనల్' అనే నినాదం కూటమి ప్రభుత్వ విధానంగా అమలు చేస్తూ ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. అందరి సహకారంతో స్వర్ణాంధ్ర - 2047 విజన్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనింపజేస్తాం'అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.