అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ కల్చర్ పడగవిప్పింది. స్కూల్లో ఓ విద్యార్ధి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం విస్కాన్సిన్ స్టేట్ మాడిసన్లోని అబండంట్ క్రిస్టియన్ స్కూల్లో 12వ తరగతి విద్యార్థి కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. కాల్పుల్లో ఐదుగురు మృతిచెందినట్టు తెలిపారు. గాయపడినవారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. మృతుల్లో కాల్పుల జరిపిన విద్యార్థ కూడా ఉన్నట్లు పోలీసులు వివరించారు. కిండర్‌గార్టెన్ నుంచి 12వ తరగతి వరకూ ఉన్న ఈ స్కూల్లో 400 మంది విద్యార్థులు చదువుతున్నారని మాడిసన్ పోలీస్ విభాగం ప్రకటన చేసింది. క్షతగాత్రులు, మృతుల శరీరాల్లో పలు బుల్లెట్ గాయాలున్నాయని తెలిపింది.
తమ పిల్లలు చదువుతోన్న పాఠశాలలో కాల్పులతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన తల్లిదండ్రులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఎమర్జెన్సీ టీమ్‌లు అంబులెన్స్‌లు, ఫైరింజన్లతో చేరుకుని.. ఆపరేషన్ ప్రారంభించారు. మిగతా విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా ఘటనతో అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. తుపాకీ సంస్కృతిపై చర్చ మొదలైంది. అగ్రరాజ్యంలో తుపాకుల వినియోగం, పాఠశాలలో భద్రత.. ప్రధాన రాజకీయ, సామాజిక సమస్యగా మారింది. ఇటీవల కాలంలో పాఠశాలల్లో వరుస కాల్పులు ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 322 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నట్లు ఓ నివేదిక తెలిపింది. 1966 తర్వాత ఆ స్థాయిలో కాల్పుల ఘటనలు జరగడం ఇదే మొదటిసారి.