మెడికల్ సైన్స్‌లో టెక్నాలజీ వినియోగంతో వైద్య రంగంలో అద్భుతాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సాంకేతికతతో రోగుల చెంతకే వైద్య సేవలు తీసుకెళ్లవచ్చని తెలిపారు. మంగళవారం మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. మెడికల్ సైన్స్ ఇప్పుడు మెడ్‌టెక్ సైన్స్ అయిందని, డీప్‌టెక్ వంటి సాంకేతిక పరిజ్ఞానంపై వైద్య విద్యార్థులు పట్టు సాధించాలని సూచించారు. రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఆస్పత్రులకు వెళ్లకుండా.. ఇళ్ల వద్దే వారికి వైద్య చికిత్స అందించేలా వైద్య రంగాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దాలని సూచించారు. మంగళగిరిలోని ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి హాజరుకావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
కార్యక్రమానికి హాజరైన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేశారు. మహిళలందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్ఫూర్తి అని, ఒడిశాలో చిన్న గ్రామలో పుట్టి ఆదర్శవంతంగా ఎదిగారని కొనియాడారు. మారుమూల గ్రామంలో గిరిజన కుటుంబం నుంచి ఆమె రాష్ట్రపతికి స్థాయి ఎదగడం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. జూనియర్ అసిస్టెంట్‌గా, ప్రొఫెసర్‌గా, కౌన్సిలర్‌గా, చైర్‌పర్సన్‌గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, గవర్నర్‌గా పలు బాధ్యతలు నిర్వర్తించారని.. ఇప్పుడు దేశానికి ప్రథమ పౌరురాలు అయ్యారని.. పట్టుదలతో కష్టపడితే ఎవరైనా అత్యున్నత స్థానానికి చేరుకోవచ్చని నిరూపించారని తెలిపారు. తాను కూడా చిన్న గ్రామం నుంచే వచ్చానన్నారు. దేశంలో ఏ ఎయిమ్స్‌కూ లేనట్లుగా మంగళగిరి ఎయిమ్స్‌కు మంచి వాతావరణంలో దాదాపు 183 ఎకరాలు ఇచ్చామని చెప్పారు.