నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం రేపింది. మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకినట్లు సమాచారం. నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలుడికి పరీక్షలు నిర్వహించగా..జికా వైరస్ నిర్ధరణ కావడంతో ఆ బాలుడిని చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యుల బృందం వెంకటాపురంలో పర్యటించనున్నారు.అక్కడ చికిత్స కొనసాగిస్తున్నప్పటికీ, పూర్తి నిర్ధారణ కోసం బాలుడి రక్త నమూనాలను పుణేలోని ప్రముఖ ల్యాబ్‌కు పంపించారు. నివేదికల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.జికా వైరస్ లక్షణాలు ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలుగా వెంకటాపురం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు వైరస్ గురించి అవగాహన కల్పించి, అవసరమైన మందులు, చికిత్సలు అందిస్తున్నారు. జికా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రాధాన్యతతో తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.