తనను క్షమించాలని కోరుతూ ప్రియుడికి వీడియో సందేశం రికార్డు చేసి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన గుజరాత్(Gujarat)లోని బనస్కాంత జిల్లాలో వెలుగుచూసింది. ఇంట్లో గొడవలతో విసిగిపోయానని, తనను క్షమించాలంటూ రాధా ఠాకోర్ (27) రికార్డు చేసిన పలు వీడియోల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కొన్నేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయిన ఆమె తన సోదరి వద్ద ఉంటూ సొంతంగా బ్యూటీ పార్లర్ నడుపుతోందన్నారు. అసలు రాధా ఠాకోర్ ఆత్మహత్యకు గల కారణాలేంటి? అవతలి వ్యక్తికి ఆమె ఎందుకు క్షమాపణ చెప్పింది? తదితర అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె ఓ ఫొటోను పంపించాలని అడిగినా అతడు పంపలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘7గంటల లోపు ఫొటో రాకపోతే ఏం జరుగుతుందో చూడు’ ఆమె అన్నట్లుగా రికార్డింగ్లో పోలీసులు గుర్తించారు. మరో వీడియోలో.. ‘‘నన్ను క్షమించు. నిన్ను అడగకుండా ఒక తప్పటడుగు వేస్తున్నా. బాధపడొద్దు. జీవితాన్ని ఆస్వాదించు. ఆనందంగా ఉండు. పెళ్లి చేసుకో. రెండు చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నా. నువ్వు సంతోషంగా ఉంటేనే నా ఆత్మకు శాంతి. పని, జీవితం పట్ల కలతతో ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని పేర్కొంది.
మరోవైపు, ఈ ఘటనపై ఆమె సోదరి ఆల్కా మాట్లాడుతూ.. ‘‘రాధ బ్యూటీపార్లర్ నడుపుతోంది. ఆదివారం రాత్రి ఇంటికి తిరిగొచ్చాక.. భోజనం చేసి నిద్రపోయింది. ఉదయం లేచేసరికి మృతిచెంది ఉంది. ఫోన్ చెక్ చేయగా.. రికార్డు చేసిన కొన్ని వీడియోలు ఉన్నాయి. మేం ప్రతిదీ పోలీసులకు అందజేశాం. ఆమెతో మాట్లాడుతున్న వ్యక్తిపైనే మాకు అనుమానం ఉంది’’ అన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.