2008వ సంవత్సరం వరకు 7వ తరగతి పిల్లలకు దేశంలోని అన్ని రాష్ట్రాలు బోర్డు ఎగ్జామ్స్ పెట్టేవి. అందులో పాస్ అయితేనే తర్వాతి తరగతికి వెళ్లొచ్చు. పొరపాటున ఫెయిల్ అయితే.. రెండు నెలల తర్వాత సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేవారు. అందులో కూడా ఫెయిల్ అయితే ఏడాది పాటు గత తరగతిలోనే కూర్చోవాల్సి వచ్చేది. అయితే 2009 నుంచి ఆ విధానాన్ని తీసేశారు. కానీ ఇప్పుడు తాజాగా కేంద్ర విద్యా హక్కు చట్టంలో మరిన్ని సవరణలు చేసింది. గతంలో మాదిరిగానే బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే అప్పటిలాగా 7వ తరగతి పిల్లలకు కాకుండా.. ఇప్పుడు 5, 8వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలు నిర్వహించబోతుంది. ఆ వివరాలేంటో మనం ఇప్పుడు చూద్దాం.
కేంద్ర ప్రభుత్వం 2010లో బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు నిబంధనలను అధికారికంగా సవరించింది. 5, 8వ తరగతి విద్యార్థులకు సక్రమంగా బోర్డు పరీక్షలు నిర్వహించే అధికారాన్ని రాష్ట్రాలకు కల్పించింది. 2009లో అమల్లోకి వచ్చిన నో డిటెన్షన్ విధానానికి దీని ద్వారా చెక్ పడనుంది. చివరగా అంటే 2019లో ఆర్టీఈలో పలు సవరణలు చేశారు. ఐదేళ్ల తర్వాత అంటే ఇప్పుడు మరోసారి సవరణలు చేపట్టగా... 5, 8వ తరగతి పిల్లలకు బోర్డు ఎగ్జామ్స్ పెట్టాలని నిర్ణయించారు.
ముఖ్యంగా 5, 8వ తరగతి పిల్లలకు బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించాలా, సాధారణ పరీక్షలే పెట్టాలా అని నిర్ణయించుకునే అవకాశాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. ఈ రెండు తరగతుల విద్యార్థులకు ప్రతీ విద్యా సంవత్సరం చివరలో వార్షిక పరీక్షలను నిర్వహించడానికి అధికారం కల్పించింది. ఎవరైనా విద్యార్థులు ఈ పరీక్షల్లో ఫెయిల్ అయితే.. రెండు నెలల తర్వాత సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. పొరపాటున అందులో కూడా తప్పితే.. మళ్లీ అదే తరగతిలో కూర్చోవాల్సి వస్తుంది.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సవరణలకు దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తోంది. గుజరాత్, ఒడిశా, మధ్య ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, ఢిల్లీతో సహా మరికొన్ని రాష్ట్రాలు ఈ తరగతుల్లో ఫెయిల్ అయ్యే విద్యార్థులను అదే తరగతిలో కూర్చోబెట్టాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. కానీ మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఇందుకు విముఖత చూపిస్తున్నాయి. ముఖ్యంగా కేరళ ప్రభుత్వం.. 5, 8వ తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షలు నిర్వహించడం పట్ల తీవ్ర వ్యతిరేకతను తెలిపింది. ఇది చిన్నారుల్లో తీవ్ర ఒత్తిడిని పెంచుతుందని స్పష్టం చేసింది.
2009లో ప్రవేశ పెట్టిన ఆర్టీఈ చట్టం నో డిటెన్షన్ విధానాన్ని కల్గి ఉంది. అంటే ఏదైనా తరగతి పిల్లలు ఫెయిల్ అయితే అదే తరగతిలో కూర్చోకుండా.. తర్వాతి తరగతికి వెళ్లిపోవచ్చు. అయితే విధానాన్ని తీసుకురావడానికి ఓ పెద్ద కారణమే ఉంది. వెనుకబడిన నేపథ్యాల నుంచి వచ్చే పిలల్లు పలు కారణాల వల్ల చదువుకు దూరం కావడం, మధ్యలో ఆపాల్సి రావడం వల్ల పరీక్షల్లో తప్పితే వారిని నిరుత్సాహపరచకుండా తర్వాతి తరగతికి తీసుకువెళ్లాలని ఈ నో డిటెన్షన్ విదాధాన్ని తీసుకు వచ్చారు. కానీ దీని వల్ల అనేక మంది పిల్లలు.. బాగా చదవడం మానేశారని దాని వల్లే 10వ తరగతి పరీక్షల్లో అనేక మంది ఫెయిల్ అయ్యారని నిపుణులు చెబుతున్నారు. ఈక్రమంలోనే మరోసారి కేంద్ర కొత్త సవరణలు చేసింది.