ట్రెండింగ్
Epaper    English    தமிழ்

11 రోజుల ముందుగానే అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వార్షిక ఉత్సవాలు

national |  Suryaa Desk  | Published : Mon, Dec 23, 2024, 07:33 PM

కోట్లాది మంది హిందువుల శతాబ్దాల కల నెరవేరిన సంఘటన ఈ ఏడాది జనవరి 22వ తేదీన జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో దివ్య రామ మందిరంలో బాల రాముడు కొలువుదీరిన శుభ తరుణం అది. ఇక అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరిగి సంవత్సరం కావస్తోంది. అయితే అంగరంగ వైభవంగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. ఇప్పుడు ఏడాది ఉత్సవాలకు సిద్ధం అయింది. అయితే జనవరి 22వ తేదీన అయోధ్య రాముడిని గర్భగుడిలో ప్రతిష్ఠించగా.. ఈ ఏడాది మాత్రం 11 రోజుల ముందుగానే అంటే జనవరి 11వ తేదీనే ఉత్సవాలను జరపనున్నారు. అందుకు గల కారణాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వివరించింది.


అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి వార్షిక ఉత్సవాల సమాచారాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ ప్రాంత ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్ననట్లు తెలిపిన ఆయన.. రామనగరిని పెళ్లి కూతురులా అలంకరించనున్నట్లు చెప్పారు. ఇకశ్రీ రామ జన్మభూమి ఆలయంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన మొదటి సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం జరపనున్నట్లు చంపత్ రాయ్ స్పష్టం చేశారు. 2024 జనవరి 22వ తేదీన పుష్య మాసం శుక్ల పక్షం ద్వాదశి తిథి రోజున అయోధ్యలో బాల రాముడు కొలువుదీరారని.. ఈ నేపథ్యంలో 2025 జనవరి నెలలో.. పుష్య మాసం శుక్ల పక్షం ద్వాదశి తిథి.. 11వ తేదీన వచ్చినట్లు చెప్పారు.


అందుకే హిందూ పంచాంగం ప్రకారం ఈ తిథిని ప్రతిష్ఠ ద్వాదశిగా పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అయోధ్య రామ మందిరంలో జనవరి 11వ తేదీ నుంచి 3 రోజుల పాటు 4 చోట్ల వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చంపత్ రాయ్ వెల్లడించారు. ఆలయ సముదాయంలోని యాగ మండపంలో, రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్‌లో, ప్రయాణికుల సౌకర్యాల కేంద్రం మొదటి అంతస్తులో, అంగద్ తిలా మైదానంలో రకరకాల కార్యక్రమాలు జరపనున్నట్లు చెప్పారు.


ఆలయ సముదాయంలోని యాగ మండపంలో జరిగే కార్యక్రమాలు


శుక్ల యజుర్వేద మధ్యదాని శాఖలోని 40 అధ్యాయాల 1975 మంత్రాలు అగ్నిదేవునికి సమర్పించనున్నారు. 11 వేద మంత్రాలను పఠించనున్నారు. ఈ పూజలు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. అదే సమయంలో శ్రీరామ మంత్రాన్ని పఠించే యాగం కూడా 2 సార్లు నిర్వహించనున్నారు. 6 లక్షల మంత్రాలను జపించనున్నారు. అంతేకాదు రామరక్షా స్తోత్రం, హనుమాన్ చాలీసా, పురుష సూక్త, శ్రీ సూక్త, ఆదిత్య హృదయ స్తోత్రం, అథర్వశీర్ష తదితర పారాయణాలు కూడా పఠించనున్నారు.


రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్‌లో జరిగే కార్యక్రమాలు


ఇక ఉత్సవాలు జరిగే 3 రోజులు.. ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు దక్షిణం వైపున ఉన్న ప్రార్థనా మందిరంలో బాల రాముడికి రాగసేవ సమర్పించనున్నారు. అంతేకాకుండా ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో బాల రాముడి సన్నిధిలో అభినందన గీతాలను కీర్తించనున్నారు.


సంగీత మానస విభావరి


ప్రయాణికుల సౌకర్యాల కేంద్రం మొదటి అంతస్తులో 3 రోజుల సంగీత మానస విభావరి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


అంగద్ తిలా మైదానం


అగంద్ తిలా మైదానంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 గంటల వరకు రామ్ కథ.. 3:30 గంటల నుంచి 5:00 గంటల వరకు రామ చరిత మానస్ ప్రవచనం చేయనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 5:30 గంటల నుంచి 7:30 గంటల వరకు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


అన్నప్రసాద వితరణ


ఇక జనవరి 11వ తేదీ ఉదయం నుంచి స్వామివారి అన్నప్రసాద వితరణ ప్రారంభించనున్నారు. అంగద్ తిల మైదానంలో నిర్వహించనున్న అన్ని కార్యక్రమాలకు అన్ని సంఘాలను ఆహ్వానిస్తున్నారు. ఇక అయోధ్య రాముడి మొదటి వార్షికోత్సవాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ వేడుకలకు భద్రతాపరంగా ఎలాంటి ఆటంకాలు ఉండవని.. భక్తులు ఎలాంటి ఆంక్షలు లేకుండా బాల రాముడి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనవచ్చని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com