దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరింది. వాయు కాలుష్యంతో పీల్చే గాలి విషపూరితంగా మారిపోయింది. కళ్ల మంటలతో పాటు ఊపిరాడక జనం ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఉదయం పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ 450కి పైగా నమోదైంది. బవానాలో అత్యధికంగా 475 పాయింట్లకు చేరింది. దీనిని చాలా తీవ్రమైనదిగా పరిగణిస్తారు. కఠిన ఆంక్షలు కొనసాగుతున్నా కాలుష్యం మాత్రం తగ్గడం లేదు. డిసెంబర్ 16 నుంచి టైర్-4 నిబంధనలు అమలు చేస్తున్నారు. సోమవారం కూడా పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దాటింది. ఉదయం 6 గంటలకు ఢిల్లీలోని 25 కేంద్రాలలో వాయు నాణ్యత సూచిక 400 కంటే అధికంగా రికార్డయ్యింది.
ఆకాశం మేఘావృతమై.. ఉండటంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. కొన్ని చోట్ల వర్షం కురిసినా ఢిల్లీవాసులకు ఉపశమనం లభించలేదు. ఢిల్లీలో కాలుష్యంతో పాటు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. సోమవారం కనిష్ఠ ఉష్ణోగ్రత 8 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. రెండు రోజుల పాటుదట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
జీఆర్పీఏపీ-4 నిబంధనలు నేపథ్యంలో ఢిల్లీలో నిర్మాణ పనులను పూర్తిగా నిషేధించారు. విద్యార్థులకు తరగతులను కూడా హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిలోని బవానా (475), రోహిణి (468), వజీర్‌పూర్ (464), అశోక్ విహార్ (460), సోనియా విహార్ (456), జహంగీర్‌పురి (453)లో అత్యధిక కాలుష్య నమోదిత ప్రాంతాలుగా నిలిచాయి. ల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఢిల్లీలో కాలుష్యంతో పాటు చలి కూడా అధికంగానే ఉంది. సోమవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్, గరిష్టంగా 20 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది.
వాయు కాలుష్యం నివారణకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఢిల్లీ తరహాలో బాణసంచా నిషేధం విధించాలని పొరుగున్న ఉన్న ఉత్తరప్రదేశ్, హర్యానాలను ఆదేశించింది. జీఆర్ఏపీ, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016ని మరింత కఠినంగా అమలు చేయాలని నొక్కి చెప్పింది. ఆంక్షలకు అనుగుణంగా ఢిల్లీలోని ఎంట్రీ పాయింట్ల వద్ద తనిఖీ బృందాలను నియమించాలని ఆదేశించింది.