డెన్మార్క్ అధీనంలోని గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేస్తానని ట్రంప్ ఆదివారం రోజు తెలిపారు. 78 ఏళ్ల డెన్మార్క్‌లోని యూఎస్ రాయబార కార్యాలయానికి రాయబారిగా కెన్ హౌరీని నియమించిన వేళ తన మనసులోని కోరికను మరోసారి బయటపెట్టారు. ఇప్పటికే పనామా కెనాల్‌పై నియంత్రణను తిరిగి పొందుతామని చెప్పడం, మెక్సికోపై దాడి చేస్తామని అనడంతో పాటు కెనడాను 51వ రాష్ట్రంగా చేస్తానన్న ట్రంప్.. తాజాగా గ్రీన్‌ల్యాండ్‌పై పడ్డారు. జాతీయ బాధ్యత, ప్రపంచంలో స్వేచ్ఛను కాపాడడానికి గ్రీన్‌ల్యాండ్‌పై యాజమాన్యం ఉండడం చాలా కీలకం అని అమెరికా భావిస్తున్నట్లు ట్రంప్ టూత్ పోస్టులో వెల్లడించారు. అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా కెన్ అద్భుతంగా పని చేయబోతున్నారని చెప్పుకొచ్చారు.
2019లో డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉడంగా.. గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అక్కడి సహజ వనరులకు ట్రంప్ ఆకర్షితుడు అయ్యారు. అయితే దీనిపై స్పందించిన డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్‌సెన్ గ్రీన్‌ల్యాండ్ అమ్మకానికి లేదని ప్రకటించారు. కానీ ట్రంప్ మరోసారి గ్రీన్‌ల్యాండ్ కొనుగోలు గురించి మాట్లాడడంతో.. సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతగా ఆ ద్వీపంలో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఒకవేళ ట్రంప్ కొనుగోలు చేస్తే ఎంత విలువ అవుతుంది, అలాగే దౌత్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూద్దాం.
గ్రీన్‌ల్యాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. 2.16 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపంలో అనేక ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. 75 శాతానికి పైగా ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. కేవలం 55 వేల 600 మంది మాత్రమే ఉండే ఈ ద్వీపంలో 30 శాతం గ్యాస్ నిల్వలు కూడా ఉన్నాయి. అలాగే గ్రీన్‌ల్యాండ్ ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నది. చేపలు పట్టడం, డెన్మార్క్ నుంచి సబ్సిడీలు, సంభావ్య వనరుల వెలికితీతపైనే ఎక్కువగా ఆధారపడుతుంది.
అమెరికా విఫల యత్నాలు..!
1946లో అమెరికా గ్రీన్‌ల్యాండ్ కోసం డెన్మార్క్‌కు 100 మిలియన్ల డాలర్ల బంగారాన్ని ఆశగా చూపించింది. అలాగే 2019లో సుమారుగా 1.4 బలియన్ డాలర్లు ఇస్తామని చెప్పింది. కానీ ప్రస్తుతం గ్రీన్‌ల్యాండ్‌లో ఉన్న సహజ వనరులు, దౌత్యపరమైన ప్రాముఖ్యతకు ఎంత విలువ చేస్తుందనేది లెక్కించలేము.
అసలు చిక్కులేంటంటే..?
గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయాలంటే.. డెన్మార్క్ తో పాటు గ్రీన్‌ల్యాండ్ ప్రజలు ఇందుకు ఒప్పుకోవాలి. కానీ గ్రీన్‌ల్యాండర్లు వ్యతిరేకించే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా.. అంతర్జాతీయ చట్టాలు మరియు ఒప్పందాలు కూడా ఇందుకు ఒప్పుకోవాల్సి ఉంటుంది. మొదటిసారి ట్రంప్ గ్రీన్‌ల్యాండ్ కొనుగోలు గురించి మాట్లాడినప్పుడు.. డానిష్ ప్రధాన మంత్రి ఫెడరిక్‌సెన్ దీనిపై స్పందించారు. గ్రీన్‌ల్యాండ్ అమ్మకానికి లేదని, గ్రీన్‌ల్యాండ్ డానిష్ కాదని వివరించారు. అలాగే గ్రీన్‌ల్యాండ్ గ్రీన్‌ల్యాండ్‌కు మాత్రమే చెందిందని.. ట్రంప్ ఏదో సరదాగా అలా అని ఉంటారని చెప్పుకొచ్చారు.
గతంలో భూభాగాలు కొనుగోలు చేసిన చరిత్ర
అయితే అమెరికా గతంలో భూభాగాన్ని కొనుగోలు చేసిన చరిత్రను కల్గి ఉంది. 1917లో డెన్మార్క్ నుంచి యూఎస్ వర్జిన్ దీవులను 25 మిలియన్ డాలర్ల బంగారానికి కొనుగోలు చేసింది. 2019లో దాని విలువ 500 మిలియన్ డాలర్లు. అలాగే 1867లో వేరు శనగ కోసం రష్యా నుంచి అలస్కాను 7.2 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.