కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా కొన్ని మార్గదర్శకాలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే చిక్కులు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా తమ ఆస్తులు, అప్పుల వివరాలు సంబంధిత అధికారులకు తెలియజేయాలి. ఉద్యోగుల ఆదాయం, ఆస్తులకు సంబంధించిన వివరాలు వెల్లడించే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇటీవలే స్పష్టత ఇచ్చింది. ముఖ్యంగా హై-వాల్యూ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన విషయాలు దాచిపెట్టకూడదని తెలిపింది. అధిక మొత్తంలో చేసే లావాదేవీలు బహిర్గతం చేయనట్లయితే వారిపై భారీగా పెనాల్టీలే కాదు క్రమ శిక్షణ చర్యలు చేపడతారు.
ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలు వెల్లడించే అంశంపై కేంద్ర ప్రజా సమస్యలు, సిబ్బంది, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఉద్యోగులు ఆస్తులు వెల్లడించే విషయాలను పర్యవేక్షించడం, వార్షిక స్థిరాస్తి రిటర్నులను పోల్చడం, ఆస్తుల వివరాల్లో తేడాలను పరిష్కరించడం వంటి విషయాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ప్రతి సంవత్సరం అధికారులు, ఉద్యోగుల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ అధీనంలోని సంస్థలు సేకరిస్తున్నాయా? గత సంవత్సరంలో ఇచ్చిన వివరాలతో పోల్చి చూస్తున్నాయా? వార్షిక ప్రాపర్టీ వివరాలు సమయానికి అందించని ఉద్యోగులపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? వచ్చే జీతానికి మించి ట్రాన్సాక్షన్సు చేసినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అనే ప్రశ్నలు వేశారు.
ఆయా ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. ఉద్యోగంలో చేరటప్పుడే ప్రభుత్వ సిబ్బంది తమ ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత ఏడాది జనవరి 31వ తేదీ లోపు స్థిరాస్తి ప్రాపర్టీ రిటర్నుల వివరాలను సబ్మిట్ చేయాలని తెలిపారు. ఈ నిబంధనలు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (కండక్ట్) రూల్స్ 1964, ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ 1968, ఎంప్లాయీస్ ఆఫ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్ ద్వారా అమలు చేయడం జరుగుతుందన్నారు.
తమ స్థిరాస్తి ప్రాపర్టీల ఆదాయం సమయానికి వెల్లడించలేకపోతే సదరు ఉద్యోగులు ఇతర ప్రయోజనాలు పొదాలంటే విజిలెన్స్ క్లియరెన్స్ తీసుకోవాల్సిన పరిస్థికి దారితీస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే రెండు నెలల బేసిక్ శాలరీ మించి చరాస్తి ప్రాపర్టీ ట్రాన్సాక్షన్లు నిర్వహించినట్లయితే సంబంధిత అధికారికి నివేదించాలని తెలిపారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి తెలియజేసిన ఆస్తులకు మించి ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఇది భారీగా పెనాల్టీలకు దారి తీస్తుందన్నారు. అంతే కాదు సర్వీసు నుంచి తొలగించే ప్రమాదమూ ఉందని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం దర్యాప్తు చేపట్టి అధికారులు నిర్ణయం తీసుకుంటారని గుర్తు చేశారు.