ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న విశాఖ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇవాళ విశాఖలో సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను లోకేశ్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కీలక ప్రాజెక్టుల శంకుస్థాపనల కోసమే ప్రధాని విశాఖకు వస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీ తన పర్యటనలో నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, రూ.70 వేల కోట్ల ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, విశాఖ-చెన్నై ఎకనామిక్ కారిడార్ లో కృష్ణపట్నం వద్ద కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన... రూ.3,900 కోట్లతో పూర్తయిన రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తారని లోకేశ్ వివరించారు. ముఖ్యమైనది, మనందరి కల విశాఖ రైల్వేజోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదని, దాంతో రైల్వే జోన్ ఆలస్యమైందని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం భూమిని కేటాయించడంతో, రైల్వే జోన్ భవన నిర్మాణాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని లోకేశ్ వివరించారు. ఇదేకాకుండా, పలు రైల్వే అభివృద్ధి పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఎన్నికల్లో ఎన్డీఏ విజయం తర్వాత తొలిసారిగా విశాఖ వస్తున్న ప్రధానికి ఘనస్వాగతం పలుకుతామని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. గాడితప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కట్టుబడి ఉన్నామని... గత వైసీపీ ప్రభుత్వం ఒక ఫేక్ ప్రభుత్వం అని విమర్శించారు. గత సర్కారు ఉత్తరాంధ్ర యువతకు ఎలాంటి ఉపాధి చూపించలేదని అన్నారు. అభివృద్ధి చేయకుండా ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ ను విశాఖకు తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇక్కడి ఎయిర్ పోర్టుకు భూసేకరణ చేసిన ఘనత కూడా ఎన్డీయే కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. విశాఖలోని రుషికొండ ప్యాలెస్ ను ఏంచేయాలో తెలియని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. ఒక్క వ్యక్తి కోసం రూ.1000 కోట్లు వృథా చేశారని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం ఉన్న కంపెనీలన్నింటినీ తరిమేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక గూగుల్, టీసీఎస్ వంటి కంపెనీలు ఏపీకి వస్తున్నాయని వివరించారు. వాలంటీర్లకు సంబంధించి గత ప్రభుత్వం ఎలాంటి జీవో ఇవ్వలేదని లోకేశ్ స్పష్టం చేశారు. ఎన్నికల వేళ 80 శాతం మంది వాలంటీర్లతో జగన్ రాజీనామా చేయించారని వెల్లడించారు.